English | Telugu

తెలంగాణలో మళ్లీ స్వైన్-ఫ్లూ కలకలం... రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు...

చలి మెల్లమెల్లగా పెరుగుతోంది. చలితోపాటే వ్యాధులు కూడా వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతోపాటు స్వైన్ ఫ్లూ కూడా మళ్లీ జడలు విప్పుతోంది. వాతావరణ మార్పులకు తోడు చలి పెరుగుతుండటంతో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతోన్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నమోదైన కేసులే అందుకు రుజువు. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 98 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23మంది మృత్యువాత పడ్డారు. నవంబరులో కూడా రెండు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృత్యువాతపడ్డారు.

అయితే, చలి మరింత పెరగనున్న నేపథ్యంలో స్వైన్ ఫ్లూ కేసులు కూడా పెరిగే అవకాశముందని వైద్యులు అంటున్నారు. ఎవరైనా జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు... హెచ్ఐవీ పేషెంట్లు... తప్పనిసరిగా వ్యాక్సిన్స్ తీసుకోవాలని చెబుతున్నారు.