ఏపీలోని జగన్ ప్రభుత్వం పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఒక లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వం FRBM పరిధిని దాటి అప్పులు చేస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో అయన పేర్కోన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నిబంధనలకు విరుద్ధంగా లోన్లు తీసుకుని.. వచ్చిన నిధులను ఉచిత పథకాల కోసం విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారని.. ఇది చాలా ఆందోళనకరమని సురేష్ ప్రభు తన లేఖలో పేర్కొన్నారు. అందుకే కార్పొరేషన్లకు ఇచ్చే రుణాలకు రెండు వందల శాతం ల్యాండ్ గ్యారంటీ తీసుకునేలా.. మార్టిగేజ్ చేసుకునేలా చూడాలని.. అలాగే రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి చాల ఆందోళనకరంగా మారిందని అయన వ్యాఖ్యానించారు.
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటక ముందే సరైన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ను సురేష్ ప్రభు కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు కూడా ఎంపీ సురేష్ ప్రభు లేఖలు రాశారు. అయితే గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన సురేష్ ప్రభు.. ఈ విధంగా లేఖ రాయడంతో దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందో అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.