English | Telugu
తెలంగాణ స్పీకర్‌కి సుప్రీం నోటీసులు
Updated : Jan 19, 2026
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో సకీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జనవరి 19) విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ తన పిటిషన్ లో పేర్కొంది.
ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.