English | Telugu
బ్రిటన్ ఆర్ధికమంత్రిగా భారతీయుడు...
Updated : Feb 13, 2020
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ఆర్ధికమంత్రిగా రిషి సునక్ నియమితులయ్యారు. ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ సజిద్ జావిద్ రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన రిషి సునక్... బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి... 2015 ఎన్నికల్లో యార్క్‌షైర్ రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు, అనూహ్యంగా బ్రిటన్ ఆర్ధికమంత్రిగా పగ్గాలు చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
39ఏళ్ల రిషి సునక్... ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ పట్టాలు అందుకున్నారు. ఆ తర్వాత స్టాన్ ఫర్డ్ వర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత పరిచయం కావడంతో... ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారడంతో 2009లో వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు.
అయితే, రిషి సునక్ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. ఇక, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లోనూ రిషి సునక్ డైరెక్టర్ గా ఉన్నారు.