English | Telugu

కేపిటల్‌ గేమ్‌కు ఎండ్ కార్డు... జగన్ సర్కార్ ఆర్డినెన్స్ అస్త్రం..! ఢిల్లీ వేదికగా టీడీపీ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఆట క్లైమాక్స్‌‌కి చేరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు నెలలుగా సాగుతున్న కేపిటల్‌ గేమ్‌కు ఎండ్ కార్డు పడబోతోంది. మూడు రాజధానులపై పంతం నెగ్గించుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న జగన్ ప్రభుత్వానికి.... అసెంబ్లీ ప్రోరోగ్ వరంగా మారింది. దాంతో, మూడు రాజధానులపై పంతం నెగ్గించుకునేందుకు జగన్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకున్నారన్న కోపంతో ఇప్పటికే మండలి రద్దుకు తీర్మానం చేసిన ప్రభుత్వం... సెలెక్ట్ కమిటీ ఫైల్‌ ముందుకు కదలకుండా పావులు కదిపింది. ఇక, వీలైనంత త్వరగా మండలి రద్దు జరిగిపోయేలా సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ టూర్‌లో మూడు రాజధానుల ఆవశ్యకతను ప్రధాని మోడీకి వివరించిన జగన్మోహన్‌రెడ్డి... మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేయాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించనున్నారు.

అయితే, సర్కారు వ్యూహాన్ని పసిగట్టిన తెలుగుదేశం... కౌంటర్ గేమ్ మొదలుపెట్టింది. జగన్ సర్కారు స్టెప్స్‌‌కు దీటుగా టీడీపీ అడుగులు వేస్తోంది. రాజకీయ కక్షతోనే మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసిందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్సీలు.... రాష్ట్రపతితోపాటు కేంద్ర పెద్దలను కలిసేందుకు అపాయింట్ మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. దాంతో, కేపిటల్‌పై అధికార, ప్రతిపక్షాల ఎండ్ గేమ్‌ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

ఇదిలా ఉంటే, ఏపీ శాసనసభ, శాసనమండలిని గవర్నర్ ప్రోరోగ్ చేయడంతో మూడు రాజధానులపై ముందుకెళ్లేందుకు జగన్ ప్రభుత్వానికి వెసులుబాటు దొరికింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఆర్డినెన్స్‌‌కు అవకాశం లభించింది. అయితే, రాజధాని ఇష్యూ కోర్టుల్లో ఉండగా ఆర్డినెన్స్‌ ఇవ్వడం సాధ్యంకాదని టీడీపీ వాదిస్తోంది. కానీ, జగన్ ప్రభుత్వం ...ప్లాన్ Aతోపాటు ప్లాన్ Bని కూడా రెడీ చేసుకుందని చెబుతున్నారు. ప్లాన్ A ప్రకారం... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించుకోవడం... అది, కుదరకపోతే ప్లాన్ Bని తెరపైకి తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

అయితే, తాము చెప్పేవరకు కార్యాలయాలను తరలించొద్దంటూ హైకోర్టు ఖరాకండిగా తేల్చిచెప్పడంతో ఆర్డినెన్స్ ద్వారా రాజధాని తరలింపు సాధ్యమేనా? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మరోవైపు, సెలెక్ట్ కమిటీలపై జాప్యంచేస్తే చర్యలు తప్పవంటూ మండలి ఛైర్మన్ హెచ్చరికలు పంపడాన్ని సీరియస్‌‌గా తీసుకున్న ప్రభుత్వం... న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి, రాజధాని షిఫ్టింగ్‌కు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న జగన్ ప్రభుత్వం... అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడంతో తర్వాతి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతున్నాయి.