రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు సుజనా వాదనతో విభేదించారు. గతంలో ఏపీ రాజధాని అమరావతి విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని, అలాగే ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అదే సమయంలో, రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందన్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజును బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ లాగా తమది కుటుంబ పార్టీ కాదని, బీజేపీ సకల జనుల పార్టీ అని అన్నారు.
అంతే కాకుండా వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీ తమకు చాలా దగ్గరేనని ప్రచారం చేసుకుంటున్నాయని అయితే ఆ రెండు పార్టీలను తాము సమానంగానే చూస్తామని తెలిపారు. తమ పార్టీ జనసేనతో కలిసి అధికారం దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఇళ్ల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని అయన ఆరోపించారు. మొత్తానికి ఒక పక్క సుజనా వచ్చి రాజధాని కేంద్రం పరిధిలోని అంశం అంటే మరో పక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అబ్బే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అంటున్నారు. దీంతో ఈ అంశం పై బీజేపీ స్టాండ్ ఏంటో తెలియక రాష్ట్ర ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.