English | Telugu

జగన్ సోదరుడి కంపెనీల్లో సిట్ సోదాలు

సిట్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలు, నివాసాలలో సోదాలు నిర్వహించింది. ఈ అనిల్ రెడ్డి ఎవరంటే జగన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు. చెన్నైలోని మైలాపూర్, టీనగర్, పేరంగుడి, అరప్పుకొట్టాయ్ తో పాటు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అనిల్‌రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, ఇంజంబాక్కం, చెన్నై అళ్వార్‌పేట్ ల్లోని అనిల్‌రెడ్డి నివాసాల్లో సిట్ ఏకకాలంలో సోదాలు చేసింది. దాదాపు పది ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది.

ఈ సోదాల్లో సిట్ కీలక డాక్యుమెంట్లు, హర్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది మద్యం ముడుపుల సొమ్మును ఈ కంపేనీల ద్వారా విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్ అందుకు సంబంధించి ఆధారాల సేకరణకు ఈ సోదాలు నిర్వహించింది. శుక్రవారం (సెప్టెంబర్ 19)న ఏకకాలంలో పది చోట్ల సిట్ చేపట్టిన ఈ సోదాలు రాత్రి పొద్దుపోయే వరకూ సాగాయి.

కాగా సిట్‌ సోదాలు చేసిన కంపెనీల్లో షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటు అయినవే కావడం గమనార్హం. మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సిట్ అనుమానిస్తోంది. అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు? , వీటి కార్యకలాపాలేంటి? అన్నదిశగా సిట్ దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అనిల్‌రెడ్డి పీఏ దేవ రాజ్‌ సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే.

ఆ విచారణలో దేవరాజ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు అనిల్ రెడ్డి నివాసాలు, కంపెనీలలో సిట్ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సిట్‌ షిలో ఇన్‌ఫ్రా వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ, షిలో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , క్వన్న ఎగ్జిమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , వర్క్‌ ఈజీ స్పేస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ , ఇండోరాక్స్‌ ఎల్‌ఎల్‌పీ , ఫోరెస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ,శ్రీ గోవిందరాజా మిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ట్రాన్‌సెల్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమి టెడ్, హైదరాబాద్‌ తదితర కంపెనీల్లో సోదాలు చేసింది.