English | Telugu

దేశమంతటా ఎస్ఐఆర్.. కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం!

ఓట్ చోరీ ఆరోపణల విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల సంఘంపై ప్రజా విశ్వాసం దెబ్బతినేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆందోళనకు, ఆయన చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయానికి వచ్చింది. ఇందు కోసం ఓటర్ల జాబితాలోని అవకత వకలను సవరించాలన్న నిర్ణయం తీసుకుంది. అందు కోసం బీహార్ చేపట్టిన విధంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఓటర్ల జాబితాలను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేయాలని నిర్ణయించింది.

బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఐఆర్ పై వచ్చిన అన్ని ఆరోపణలకూ వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా మాత్రమే ఓటర్ల జాబితాలోని అవక తవకలు, లోపాలను సరిద్దిద్దడం సాధ్యమౌతుందని భావిస్తోంది. గత దశాబ్దాలలో జరిగిన పట్టణీకరణ, కార్మికుల వలసలు వంటి కారణాలతో ఓటర్ల జాబితాలో చేరిన డూప్లికేట్ ఎంట్రీలు, దొంగ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ చేపట్టింది. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు అదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అములు చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే.. ఓటర్ల జాబితాల అంశం ప్రతి సారి వివాదాస్పదమవుతోంది.

అధికారంలో ఉన్న రాజకీయపార్టీలు.. కుట్రపూరితంగా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు తప్పుడు మార్గాల్లో ఓటర్లను చేర్చించడానికి చేసిన ప్రయత్నాలు నకిలీ, దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో జాబితాలో చోటు చేసుకోవడంతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ హయాంలో అధికా రుల్ని సైతం బెదిరించి వేల దొంగ ఓట్లు చేర్పించడం.. అసలైన ఓటర్లను తొలగించడం వంటివి జరిగాయన్న ఆరోపణలు రావడం విదితమే. ఇలాంటి వాటినన్నిటినీ ఎస్ఐఆర్ ద్వారా సరిదిద్దడానికి అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది.