English | Telugu
మోడీ... ట్రంప్... ఇద్దరూ ఇద్దరే... ఇద్దరికీ దేశ ప్రయోజనాలే ముఖ్యం..
Updated : Feb 25, 2020
అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటించడం కొత్తేమీ కాదు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సగటున పదేళ్లకొకరు చొప్పున అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటిస్తూనే ఉన్నారు. ఒబామా అయితే తన పదవీ కాలంలో రెండుసార్లు భారత్ లో పర్యటించారు. అమెరికా అధ్యక్షులు ఎప్పుడు పర్యటించినా ...అవి రెండు దేశాల్లో పెద్దగా సంచలనాలు సృష్టించిన దాఖలాలు లేవు. తాజాగా ట్రంప్ పర్యటన మాత్రం అమెరికా గత అధ్యక్షుల పర్యటనలకు భిన్నంగా జరిగింది. పర్యటన గురించి రెండు దేశాల్లోనూ ఎంతో హైప్ క్రియేట్ అయింది. భారీ స్థాయి వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అమెరికాలో ప్రచారం భారీగా జరిగింది. అయితే, భారీ వాణిజ్య ఒప్పందాలేవీ లేవని....రక్షణ ఒప్పందాలు మాత్రమే ఉంటాయని తేలిపోయింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ ప్రధాని మోడీ ఇద్దరూ జాతీయవాదానికి పట్టంకట్టే నాయకులే. దేశ ప్రయోజనాలే వీరిద్దరికీ ముఖ్యం. అందుకే, ఒకరికొకరు నచ్చినట్లుగా ఉంది. కరచాలనం చేసుకోవడం మొదలుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, భుజాలు తట్టుకోవడం దాకా వారు ప్రదర్శించే ధోరణి, హావభావాలు అన్నీ కూడా ఒకరి పట్ల మరొకరికి గల స్నేహభావాన్ని సూచిస్తుంటాయి. ఈ స్నేహం వ్యక్తిగతం మాత్రమే....దేశ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఎవరికి వారు తమ దేశ ప్రయోజనాలకే కట్టుబడి ఉంటారు. అమెరికా ప్రతిపాదించిన రీతిలో సుంకాలు తగ్గించేందుకు, భారీగా మాంసం, పాలు, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మోడీ నిరాకరించారు. దాంతో వాణిజ్య ఒప్పందాల అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాయిదా వేసుకున్నారు. ఆ విషయం గురించి అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశం తరువాత ఆలోచిద్దామన్నారు. ఇక్కడే అసలు విషయం అందరికీ అర్థమైపోయింది.
మోడీ పర్యటన కారణంగా భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఏర్పడింది. మరీ ముఖ్యంగా రక్షణ ఒప్పందాలు కుదరడం అంటే పాకిస్థాన్ కు భారత్ ఓ హెచ్చరిక సంకేతం పంపడమే. అయితే ఇలాంటి హెచ్చరిక సంకేతాలతో అటు పాకిస్థాన్ కు కూడా ఆయుధాలు విక్రయించి అమెరికా సొమ్ము చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ దఫా అమెరికా అలాంటి ఎత్తుగడతో వచ్చిందనుకోలేం. భారత్ ప్రపంచంలోని ముఖ్యమైన ఆర్థిక, సైనిక శక్తుల్లో ఒకటిగా మారుతోంది. గతంలో మాదిరిగా అమెరికా డబుల్ గేమ్ ఆడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరో వైపున అమెరికా, భారత్ వాణిజ్యబంధం కూడా పెరిగిపోతున్నది. మొన్నటి వరకూ భారత్ కు చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండింది. ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తోంది. 2019లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత్ చైనా వ్యాపారం 65 బిలియన్ డాలర్లుగా ఉండింది. అదే సమయంలో అమెరికాతో వాణిజ్యం 68 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడం ఇప్పటికైతే హర్షదాయకమే. అమెరికా ఎన్నికల అనంతరం మాత్రం సుంకాల తగ్గింపు విషయంలో భారత్ పై అమెరికా ఒత్తిళ్లు తెచ్చే అవకాశం ఉంది. అలాంటి ఒత్తిళ్లను తట్టుకునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి.
అమెరికా, భారత్......ఈ రెండు దేశాలకూ ఉగ్రవాదం ప్రధాన శత్రువుగా ఉంది. ఉగ్రవాదం అంతు చూడడంలో అమెరికా కఠినంగానే వ్యవహరిస్తోంది. భారత్ కు కావాల్సింది కూడా అదే. ఈ నేపథ్యంలో ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, ఇండియా మధ్య స్నేహసంబంధాలు ఎంతో కీలకం. నాయకుల రాజకీయ ప్రయోజనాలు మాట అటుంచి....రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ ఒప్పందాలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే అవి ఉభయతారకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నాయకుల మధ్య, దేశాల మధ్య స్నేహం పదికాలాల పాటు నిలుస్తుంది.