English | Telugu

క‌రోనా మృతుడు ఐదురోజుల పాటు హైద‌రాబాద్‌లోనే ఉన్నాడ‌ట‌!

'కేర్' లో చికిత్స జ‌రిగింది. అయితే పర్యవేక్షించిన నర్సు ఐసోలేషన్‌లో వుంచారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ వాసుల్ని వ‌ణికిస్తోంది.

కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు హైదరాబాద్‌ పాతబస్తీలో ఉన్నారట‌. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స అందించగా ఆయన్ను పర్యవేక్షించిన నర్సును ప్ర‌స్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు.

దేశంలో తొలి కరోనా మరణం ఇదే కావడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఆయన మార్చి 10న కరోనా లక్షణాలతో చనిపోయారు. ఆయనకు కోవిడ్ సోకినట్లు చనిపోయిన తర్వాత నిర్ధారించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన.. డిశ్చార్జి అయిన కాసేపటికే చనిపోయారు. అంతకు ముందు నగరంలోని మరో రెండు హాస్పిటళ్లు ఆయన్ను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించాయి. ‘‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న కరోనా అనుమానితుడు హాస్పిటల్‌కు వచ్చాడు. ఐసోలేషన్‌లో ఉంచిన తర్వాత కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని ఆయన్ను తీసుకొచ్చిన వారికి సూచించాం. కానీ ఆయన కుటుంబ సభ్యులు మా సూచనకు విరుద్ధంగా కలబుర్గి తీసుకెళ్లారు. కాగా కేర్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ బయల్దేరిన గంటకే ఆ పేషెంట్ చనిపోయాడు.

కలబుర్గికి చెందిన వృద్ధుడు జనవరి 29న సౌదీ అరేబియాలోని మక్కా వెళ్లారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించగా ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. దీంతో హైదరాబాద్ నుంచి కలబుర్గి వెళ్లారు. మార్చి 5 నాటికి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కలబుర్గిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కరోనా సోకిందనే అనుమానంతో ఆయన శాంపిళ్లను సేకరించి బెంగళూరు పంపారు. కారణలేంటో తెలీదు కానీ మార్చి 9న ఆయన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చి కేర్ హాస్పిటల్‌లో చేర్పించారు.
మరుసటి రోజు కేర్ నుంచి తీసుకెళ్తుండగా.. కలబుర్గి వెళ్లే దార్లోనే ఆయన చనిపోయారు. కలబుర్గిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.

బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ ఆయన్ను మూడు గంటలపాటు ఐసీయూలో ఉంచిందని.. తర్వాత గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కలబుర్గిలో చనిపోయిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. కేర్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్యశాఖ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం ఐదు ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా.. మరో 60 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌లలో కూడా ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా అనుమానితుల వైద్య పరీక్షల రిపోర్టు వచ్చే వరకు అనుమానితులను డిశ్చార్జి చేయొద్దని ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.