English | Telugu

సోనియా స్థానంలో యూపీఏ చైర్మెన్ గా శరద్ పవార్! 

యూపీఏ కూటమికి కొత్త సారథి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ ఈ పదవి నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరలో ఈ బాధ్యత నుంచి తప్పుకుంటారని తెలుస్తోంది. రైతుల ఆందోళన సందర్భంగా ఇటీవల నేతలతో సంప్రదిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఈ పదవిలో కొనసాగే విషయంలో తన విముఖత ప్రదర్శించారని సమాచారం. తన స్థానంలో మరో నేతను ఎన్నుకోవాల్సిందిగా ఆమె సూచించారని చెబుతున్నారు. దీంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నాయకత్వం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌కు వహించబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. యూపీఏ అధ్యక్ష పదవికి పవార్ అయితేనే పవర్‌ఫుల్‌గా ఉంటుందనే అభిప్రాయాలు బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయట.

ప్రస్తుతం యూపీఏ కూటమి దాదాపు పతనావస్థలో ఉంది. సొంత పార్టీనే నిలబెట్టలేని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఈ నేపధ్యంలో యూపీఏకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడానికి శరద్ పవార్ కు బాధ్యతలు అప్పగించాలని మిగితా విపక్ష పార్టీలన్ని భావిస్తున్నాయట. యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ నియమితులైతే మహదానందమని శివసేన ప్రకటించింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని, అందుకే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సి ఉందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. యూపీఏ చైర్మన్‌గా శరద్ పవార్ బాధ్యతలు స్వీకరిస్తే శివసేన మద్దతు ఇస్తుందని కూడా సంజయ్ రౌత్ ప్రకటించారు.

మరోవైపు ఎన్సీపీ మాత్రం అలాంటి ప్రస్తావన ఏమి లేదని చెబుతోంది. యూపీఏలో ఉన్న మిత్ర పార్టీలతో ఇలాంటి చర్చలు ఏవీ జరగలేదని, ఇలాంటి ప్రతిపాదనలు తమ వరకు రాలేదని ఎన్సీపీ నేత మహేష్ తపసీ అన్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌గా శరద్ పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని చెప్పారు రైతులు చేస్తున్న ఆందోళన నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకు కొన్ని మీడియా సంస్థలు పుకార్లు పుట్టిస్తున్నాయని మహేష్ చెప్పారు.