English | Telugu

అమీర్‌పేటలో ఘోర ప్రమాదం.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో తల ఇరుక్కుని...

హైదరాబాద్ లోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెట్రో స్టేషన్‌ రైలింగ్‌కు ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడు. మరొక యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి.

కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్ (24), అతని స్నేహితుడు రవితేజతో కలిసి ద్విచక్రవాహనంపై వేగంగా ఖైరతాబాద్ వైపు నుంచి కూకట్‌పల్లి వైపు వెళుతున్నారు. అమీర్‌పేట చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి మెట్రో స్టేషన్‌ రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో గిరీష్ తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌ లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ రవితేజని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ కట్టర్‌తో ఇనుపకడ్డీలను తొలగించి, గిరీష్ మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.