English | Telugu

పదవుల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ నాయకులు

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తరువాత ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు వలస వచ్చి గులాబీ గూటికి చేరారు. వీరందరూ తమకు ఏదో ఒక రూపంలో అవకాశం వస్తుందన్న విశ్వాసంతో టీఆర్ఎస్ లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన గజ్వేల్ నియోజక వర్గ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఇటీవలే కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో మళ్లీ పదవుల పంపకంపై చర్చ మొదలైంది. ఒక వైపు పలు కార్పొరేషన్ చైర్మన్ ల పదవీ కాలం కూడా ముగియడంతో ఆశావహులు తమకు వీటిలో ఏదో ఒకటి దక్కకపోతుందా అన్న ఆశతో ఉన్నారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు, మంత్రి పదవులు ఆశించి దక్కని వారు కూడా తమకు ఏదో ఒక అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. సెప్టెంబరులో మంత్రి వర్గ విస్తరణ సమయంలో సీనియర్ నాయకులకు పదవులు ఇస్తామని ప్రకటించారు కేసీఆర్ . ఆ ఎఫెక్ట్ తో దసరాకు పదవుల పంపకం ఉంటుందని ఆశించారు ఆశావహులు. హుజూర్ నగర్ భై ఎలక్షన్స్ రావటంతో టీఆర్ఎస్ పెద్దలంతా వాటిపై దృష్టి పెట్టారు. దీనితో పదవుల పంపకం జరగలేదు.

ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలు పెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ తిరిగి కొంత ఆలస్యం అవుతుందేమోనన్న అనుమానాలు ఆశావహుల్లో వ్యక్తమవుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసిన ఒకరిద్దరు చైర్మన్ లకు మరోసారి అవకాశం దక్కింది.ఇప్పటికే కార్పొరేషన్ చైర్మెన్ లుగా ఉండి పదవీ కాలం పూర్తయిన వారు కూడా తమకు ఇంకోసారి అవకాశం ఉంటుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా టిఆర్ఎస్ లో నామినేటెడ్ పదవులు రాని వారు, పదవులు వచ్చి కాల పరిమితి ముగిసిన వారు తమ భవిష్యత్తు ఏంటా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల తరువాత పదవుల పంపకం ఉంటుందా లేక వాటితో సంబంధం లేకుండా పదవుల భర్తీ చేస్తారా అన్నది చూడాల్సి ఉంటుంది.