English | Telugu

మోగిన స్థానిక నగారా!

తెలంగాణ స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ ను సోమవారం (సెప్టెంబర్ 29) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయి. తొలి రెండు దశలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తరువాత మూడు దశలలో వార్డు, సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో పాటు ప్రభుత్వం కూడా తాము స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని తెలిపింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 23, 27 తేదీలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు నవంబర్ 11న కౌంటింగ్ జరిపి ఫలితాలను విడుదల చేస్తారు. ఇక వచ్చే నెల 31, నవంబర్ 4, 8 తేదీలలో వార్డు, సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. గ్రామపంచాయతీల ఎన్నికల పోలింగ్ జరిగిన రోజునే ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు.

రాష్ట్ర హై కోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం 42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనే. అయితే రేవంత్ సర్కార్ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.