English | Telugu
కడప జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం సెంటర్ మూసివేత!
Updated : Apr 5, 2020
★ఏటీఎం సెంటర్ పై ఉమ్మేసిన యువకుడు
ఏ టీ ఎం సెంటర్లకు వెళ్లే వారూ ఓ సారి ఈ వార్త చదివి, ఆనక ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. అసలే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. కరోనా భయాందోళన ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, ఉంటే ఇంట్లో ఉండాలని, ఏవైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తుంటే, ఒకతను మాత్రం, ఎవరూ ఊహించని పని చేశాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ కు వచ్చాడు.
లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్ ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు. అతనికి జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరం కూడా ఉందని వైద్యులు తేల్చారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేసిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తరువాత విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.