English | Telugu

హజ్‌ యాత్రపై గందరగోళం! వాయిదా వేసుకోమంటున్న హ‌జ్ మంత్రి!

కరోనా వైరస్ నేప‌థ్యంలో హ‌జ్ యాత్ర‌పై సౌదీ స‌ర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2020 హజ్ లో పాల్గొనే యాత్రికులు వాయిదా వేసుకోవాల‌ని హ‌జ్ మంత్రి మొహ‌మ్మ‌ద్ బంటెన్ విజ్ఞ‌ప్తి చేశారు. యాత్రికుల భ‌ద్ర‌త త‌మ‌కు ముఖ్య‌మ‌ని, వైర‌స్ నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చే వ‌ర‌కు యాత్రికులు త‌మ ప్లాన్‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఆదేశించారు.

షెడ్యూల్ ప్రకారం... ఈ ఏడాది జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ప్ర‌పంచం న‌లువైపుల నుంచి దాదాపు 40 ల‌క్ష‌ల మంది హ‌జ్‌ యాత్ర‌కు వెళ్ల‌నున్నారు. అయితే వారంతా త‌మ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవాల‌ని సౌదీ విజ్ఞప్తి చేసింది.

ఎప్పుడు కరోనా నుంచి బయటపడతామో తెలియని పరిస్థితి. హజ్‌ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్‌ ఫిలిగ్రిమ్స్ ను సూచించింది. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 40 లక్ష‌ల ముస్లీం యాత్రికులంతా హజ్‌ యాత్రకు తరలివస్తారు.

ఇండియా నుంచి ఈ ఏడాది ల‌క్షా 75 వేల మంది హ‌జ్ యాత్ర‌కు వెళ్ళ‌నున్నారు. ఒక్కొక్క‌రికి దాదాపు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చు వ‌స్తుంది. ఇప్ప‌ట్టికే ఒక్కొక్క‌రు రెండు విడ‌త‌ల్లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు హ‌జ్ క‌మిటీ ఆఫ్ ఇండియాకు చెల్లించారు. మూడ‌వ విడ‌త కింద మ‌రో ల‌క్ష రూపాయ‌లు చెల్లించాల్సి వుంది.

షెడ్యూల్ ప్ర‌కారం జూన్ నెల నుంచే సౌదీకి హ‌జ్‌యాత్రికుల్ని తీసుకుని విమానాలు బ‌య‌లుదేరుతాయి. ఈ నేప‌థ్యంలో హ‌జ్ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోమ‌ని సౌదీ హ‌జ్ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న గొంద‌ర‌గోళంలో ప‌డ‌వేసింది. ఈ ఏడాది హ‌జ్ యాత్ర వుంటుందా? లేదా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.