English | Telugu

ఏపీలో ఆలయాలపై కొనసాగుతున్న దాడులు.. విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం

ఏపీలో హిందూ ఆలయాలు, ఆలయాల ఆస్తుల పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న అంతర్వేది రధం దగ్ధం ఘటన మరిచిపోక ముందే విజయవాడ దుర్గగుడి రథంలో వెండి సింహాలు మాయమైన ఘటన దుమారం రేపుతోంది. ఈ ఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే కృష్ణా జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ శ్రీ షిర్డీసాయిబాబా ఆలయం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేసారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్రామంలోని స్థానికులు, ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.