English | Telugu
ఆర్టీసీ సమ్మెకు పరిష్కారమెప్పుడు? హైకోర్టే అటోఇటో తేల్చేయనుందా?
Updated : Oct 24, 2019
హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికుల చర్చలు జరిపేందుకు ముందుగా డిమాండ్లపై మరోసారి సమీక్ష, పరిశీలన జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ ఏర్పాటుచేసిన కమిటీ.... కార్మికుల డిమాండ్లపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా... మిగిలిన 21 డిమాండ్లపై అధ్యయనం చేస్తూ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. బస్ భవన్లో సుదీర్ఘంగా సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ... కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ తప్ప... మిగతా అంశాలపై ఈడీ కమిటీ దృష్టిపెట్టింది. ప్రతి డిమాండునూ క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న కమిటీ... వాటిని అమలుచేస్తే ఆర్టీసీపై ఎంత భారం పడుతుందనే దానిపై నివేదికలు సిద్ధంచేస్తున్నారు. ప్రతి డిమాండుకూ రెండు రకాల సమాధానాలు సిద్ధంచేస్తోన్న అధికారులు.... హైకోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నాయంటోన్న ప్రభుత్వం... ఇతర డిమాండ్లపై మాత్రం కమిటీ నివేదిక ఆధారంగా చర్చలు జరపాలని నిర్ణయించింది. అక్టోబర్ 28లోపు కార్మికులతో చర్చలు జరిపి ఆ సారాంశాన్ని తమకు చెప్పాలని హైకోర్టు ఆదేశించడంతో... ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈడీ కమిటీ సూచనలు సలహాల మేరకు హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా... ఒకట్రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరిపి న్యాయస్థానానికి నివేదించనుంది. అయితే, కార్మికులతో చర్చలు జరపాలంటూ హైకోర్టు నేరుగా ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీకి ఆదేశించడంతో... అతని ద్వారానే తాము చెప్పదల్చుకున్నది న్యాయస్థానానికి తెలపాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే, ప్రభుత్వ వెర్షన్ ఇలాగుంటే, ఆర్టీసీ విలీనం డిమాండ్ పై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రభుత్వం అవసరమైతే ఆర్టీసీ సమ్మె ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లాలని సవాలు విసిరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె అన్యాయమని ప్రజలు తేల్చితే తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరతామన్నారు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ కి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని అశ్వద్ధామరెడ్డి డిమాండ్ చేశారు. తామెప్పుడూ విలీనం కాకుండా మిగిలిన డిమాండ్లపై చర్చకు వస్తామని చెప్పలేదన్నారు. అయితే, చర్చల్లేవ్ అని ఒకసారి... విలీనం మినహా చర్చలకు ఓకే అని మరోసారి ఇలా వేర్వేరు ప్రకటనలతో ప్రభుత్వం మైండ్‌గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. అయితే అటు ప్రభుత్వం... ఇటు కార్మిక సంఘాలు మొండి పట్టుదలతో ముందుకు వెళ్తుండటంతో... మరి ఈనెల 28న హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదిఏమైనా హైకోర్టు సీరియస్ గా జోక్యం చేసుకుంటేనే తప్ప సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.