English | Telugu
ప్రచారాన్ని ఏదో పిక్నిక్ లాగా చేశాడు.. రాహుల్ గాంధీ పై విరుచుకు పడ్డ ఆర్జేడీ..
Updated : Nov 16, 2020
బీహార్ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయో లేదో అపుడే కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ లో లుకలుకలు మొదలయ్యాయి. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ సీనియర్ నేత శివానంద తివారీ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో మనస్ఫూర్తిగా పాల్గొనలేదని, ఎదో ఒక పిక్‌నిక్ స్పాట్‌కు వచ్చినట్టు వచ్చి వెళ్లారని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. మహాఘట్ బంధన్‌లో కాంగ్రెస్ పార్టీ ముందరి కాళ్ల బంధం లా తయారైందని.. 70 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిన కాంగ్రెస్ కనీసం 70 ర్యాలీల్లో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని అన్నారు. "ఇక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అయితే బీహార్ వైపు కూడా తొంగిచూడలేదని.. రాహుల్ గాంధీ మాత్రం కేవలం మూడు రోజులు మాత్రమే ప్రచారానికి వచ్చారు. అంతేకాకుండా బిహార్ అంటే తెలియని వారిని కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి పంపింది. బీహార్ లో ఎన్నికలు చాలా గంభీరంగా సాగుతుంటే.. రాహుల్ మాత్రం సిమ్లాలో ఉన్నారు. అసలు ఒక పొలిటికల్ పార్టీని నడపడం ఇలాగేనా?" అని శివానంద్ తివారీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రవర్తించడం బిహార్‌లోనే మొదటిసారి కాదని, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రాలలోని మిత్ర పక్షాల కంటే ఎక్కువ సీట్లు తీసుకోవాలన్న తాపత్రయమే తప్ప.. తీసుకున్న సీట్లలో కనీసం సీట్లను కూడా గెలిచే ప్రయత్నం చేయడంలేదని అయన ఎద్దేవా చేశారు. బీహార్ లో తాజాగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పట్టుబట్టి మరీ 70 స్థానాలలో పోటీ చేసి కేవలం 19 స్థానాలలో మాత్రమే గెలవడంతో తమకు అధికారం దక్కలేదని ఆర్జేడీ గుర్రగా ఉన్నట్లుగా తెలుస్తోంది.