English | Telugu

రెవెన్యూలో రిజిస్ట్రేషన్ల శాఖ విలీనం? ఆందోళనలో ఉద్యోగులు! 

రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలలుగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ‘ధరణి’ పోర్టల్ అందుబాటులోకి రావడంతో కొన్ని రోజులుగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, ఆటోమెటిక్ మ్యుటేషన్లు జరుగుతున్నాయి. మొదటి రోజు కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా సాగు భూముల క్రయవిక్రయాలనుతహశీల్దార్లు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వారికే ప్లాట్ల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను కూడా అప్పగిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తహశీల్దార్ కార్యాలయాల్లోనూ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాదు రెవెన్యూ శాఖలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ పనులతో పాటు ఉద్యోగులనూ విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అండ్ ఇన్ స్పెక్టర్ జనరల్ పోస్టును కూడా రద్దు చేసే యోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై చర్చించేందుకే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారని చెబుతున్నారు.దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలోనే రెవిన్యూ శాఖలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ విలీనంపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

దశాబ్దాలుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలు వేర్వేరుగా పని చేశాయి. ఇటీవల ‌సాగు భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించారు. ఇప్పుడేమో ఏకంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్ లను కూడా అప్పగించి, ‌స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూ శాఖలో విలీనం చేయాలన్న ఆలోచనను ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ బాధ్యతలకు జిల్లా స్థాయిలో ఏ అధికారిని నియమించలేదు. రానున్న రోజుల్లో విలీనం చేస్తే ఆ శాఖ జిల్లా స్థాయి అధికారి తమపై పెత్తనం చెలాయించే అవకాశం ఉందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ధరణి’ పోర్టల్ లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరుగా నమోదు చేయడం సంబంధిత శాఖలను విలీనం చేయాలన్న ఆలోచనల నుంచే పుట్టినట్లు ఉద్యోగులు భావిస్తున్నారు.

మరోవైపు ధరణి’ పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును త్వరలోనే ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు, ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే గడిచిన రెండు నెలలుగా ఎలాంటి లావాదేవీలు లేకపోవడంతో ప్రభుత్వం రూ.వందల కోట్లు నష్టపోయింది. ఇంకా జాప్యం చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.ఉద్యోగ సంఘాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుందని చెబుతున్నారు.