English | Telugu
టికెట్ రాకుంటే జంపే! గులాబీకి రెబెల్స్ గండం
Updated : Nov 18, 2020
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి 25 నుంచి 30 మంది వరకు కొత్తవారికి టికెట్లు ఇస్తారని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. పనితీరు సరిగా లేని, వివాదాలున్న 25 నుంచి 30 మంది సిట్టింగ్ లను తప్పిస్తారని తెలుస్తోంది. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, అంబర్ పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్, గోషామహల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగులకు మొండి చేయి చూపే అవకాశం కనిపిస్తున్నది. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ కార్పొరేటర్లు,ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ నేతలు.. పార్టీ నుంచి ఎవరూ వలస పోకుండా చూస్తున్నారట. అందుకే జాబితా విడుదల ఆలస్యం అయిదంటున్నారు. వివాదం లేని చోట నామినేషన్లు వేసేందుకు రెడీగా ఉండాలని అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్తున్నట్టు తెలిసింది. వివాదం లేని డివిజన్ల అభ్యర్థుల పేర్లను ముందుగా ప్రకటించి.. వివాదం ఉన్న చోట్ల నామినేషన్ల పరిశీలన రోజే బీ–ఫామ్ ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. దీంతో టికెట్ దక్కని సిట్టింగ్ కార్పొరేటర్లకు మరో అవకాశం ఉండదు కాబట్టి.. వారంతా పార్టీలోనే ఉండేలా గులాబీ పార్టీ ప్లాన్ చేసిందని చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. టికెట్ కోసం ఒక్కో డివిజన్లో నలుగురి నుంచి 10 మంది వరకు పోటీ పడుతున్నారు. టికెట్ దక్కకపోతే వేరే పార్టీలో చేరాలని, అక్కడా టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని ఓడించాలని కొందరు కారు పార్టీ నేతలు పట్టుదలగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో రెబల్స్ బెడద లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకోవాలని పార్టీ ఆదేశించినట్టు తెలిసింది. రెబల్స్ ను దారిలోకి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. ముందుగా బుజ్జగించాలని, లేకపోతే ఇతర పద్ధతుల్లో దారిలోకి తెచ్చుకునేందుకు వెనకాడొద్దని ఆలోచనగా ఉన్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఏంచేసైనా సరే గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది అధికార పార్టీ.
బల్దియాలో టికెట్ల కేటాయింపు ప్రక్రియలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్ గా కనిపిస్తోంది. చెప్పినవారికే టికెట్లు ఇచ్చి... వారిని గెలిపించే బాధ్యత కూడా ఎమ్మెల్యేలపైనే వేసినట్లు తెలుస్తోంది. నిజానికి గ్రేటర్ లో చాలా రోజులుగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లుగా విడిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కార్పొరేటర్లు పట్టించుకోవడమే మానేశారు. ఇంకొన్ని డివిజన్లలో ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు తరచూ మంత్రి, ఎమ్మెల్యేలు రావడాన్ని కూడా కొందరు కార్పొరేటర్లు సహించలేకపోయారు. అయితే ఇంతకాలం ఎమ్మెల్యేలను ధిక్కరించిన కార్పొరేటర్లు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో పార్టీ అధిష్ఠానం వారిమాటే ఫైనల్ అని చెప్పడంతో వారంతా మరో అవకాశం కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని చెబుతున్నారు.