English | Telugu
క్లోజ్డ్ డోర్‌లో జరిగిన మంతనాలేమిటి? అసలు అంబానీ ఎందుకు వచ్చారు?
Updated : Mar 2, 2020
ఇద్దరి మధ్య డీల్ డన్ అయ్యిందా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ పై రాష్ట్రంలో ఆసక్తికరంగా మైన చర్చ జరుగుతోంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతి వెనుక రిలయన్స్ కుట్ర వుందంటూ గగ్గోలు పెట్టిన వారే ఇప్పుడు చేతులు కలుపుతారా? బబాయి వివేకానందరెడ్డి హత్య ఉదంతంపై కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడేమో తండ్రిని చంపినవారితో జగన్ మంతనాలేమిటని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సిఎం జగన్ అంబానీతో ఏం మాట్లాడారు?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పర్యటనకు గల కారణాలపై అటు పార్టీలో, ఇటు అధికారుల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. గన్నవరం విమానాశ్రయంలో దిగేవరకూ అంబానీ వస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. వాస్తవానికి సీఎం జగన్ షెడ్యూల్ లో అంబానీతో భేటి లేదు. పోనీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం కావచ్చు అంటే అదీ లేదు.
ఒక పక్క అంబానీ తనతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులను తీసుకురాలేదు. అంటే ఇది అఫీషియల్ బిజెనెస్‌కు సంబంధించిన భేటి కాదని తెలిసింది. ముఖేష్ అంబానీతో అతడి కుమారుడు అనంత్ అంబానీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాత్వానీ ఉన్నారు.
మరో పక్క సీఎం జగన్ - ముకేష్ అంబానీల సమవేశానికి ప్రభుత్వ అధికారులు ఎవరూ లేరు. ఇది పూర్తిగా ప్రైవేటు భేటి అని తెలిసింది.
ఏప్రిల్ లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పరిమల్ నాత్వానీని ఏపీ కోటాలో వైసీపీ తరుఫున రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయాలని సీఎం జగన్ ను కోరడానికే ముఖేష్ అంబానీ వచ్చినట్టు తెలుస్తోంది.
పరిమల్ నాత్వానీ జార్ఖండ్ రాష్ట్రం నుంచి రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.
బీజేపీ జార్ఖండ్ లో దారుణంగా ఓడిపోవడంతో ఈసారి అక్కడి నుంచి నాత్వానీ రాజ్యసభకు వెళ్లడం కష్టం. అందుకే ముకేష్ అంబానీయే కదిలివచ్చి సీఎం జగన్ ను ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది. వైసిపి తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థుల జాబితాలో రిలయన్స్ అభ్యర్థికి చోటు దక్కుతుందా? అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రతిపాదనకు ఎలా రియాక్ట్ అయ్యారన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.