English | Telugu

కలెక్టర్‌ బదిలీ వెనుక కొత్త కోణం.. సంతకం పెట్టు లేదా సెలవుపై వెళ్లిపో!

నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబును ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆయన బదిలీ వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. భూ తతంగంలో మాట వినకపోవడంతో బదిలీ చేయించినట్టు సమాచారం.

పేదల ఇళ్ల స్థలాల కోసం నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని బుడంగుంట వద్ద గల 35 ఎకరాలు కొనుగోలు చేయాలని భావించిన అధికారులు.. ఎకరం ధర రూ.13 లక్షలుగా నిర్ణయించారు. ఈ భూముల్లో అంతగా సాగు కాకపోవడంతో విక్రయించేందుకు రైతులు కూడా అంగీకరించారు. అలాగే, ఈ భూముల పక్కనే గల మరో 37 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని అధికారులు భావించారు. ఎకరం రూ. 27 లక్షలకు ఇవ్వడానికి వారు ఒప్పంద పత్రాలు కూడా ఇచ్చారు. ఈ భూముల కొనుగోలుకు దాదాపుగా నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అప్పుడే అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఇవి టీడీపీ సానుభూతిపరుల భూములని, వాటిని కొనడానికి వీలు లేదని అడ్డుపడ్డారట.

ఈ భూములకి బదులుగా కావలి రైల్వే లైన్ కు అవతలి వైపు తిప్ప పరిధిలో గల 115 ఎకరాలను ఎంపిక చేశారు. రిజిస్ర్టార్‌ ఆఫీసు రికార్డుల ప్రకారం ఈ భూమి విలువ ఎకరం రూ.12 లక్షలు. అయితే, ఈ భూమిలో కొంత విస్తీర్ణానికి గతంలో కన్వర్షన్‌(భూ వినియోగ మార్పిడి)కి అనుమతించారు. దీంతో ఆ సర్వే నంబరులో మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.24 లక్షలకు పెరిగింది. నిజానికి, వ్యవసాయానికి ఏ మాత్రం అనువుగాని భూములవి. రిజిస్ర్టార్‌ ఆఫీసు రికార్డుల ధర ప్రకారం అమ్మాలన్నా ఈ భూములను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురారు. అలాంటి భూములకు రెక్కలు వచ్చేలా చేశారు కొందరు అధికార పార్టీ నేతలు. మొత్తం 115 ఎకరాలకు 'కన్వర్షన్‌' భూమి ధరే ఉన్నట్లుగా చూపారు. ఎకరం ధర రూ.60 లక్షలుగా నిర్ణయించి.. ఆ తర్వాత ఐదు లక్షలు తగ్గించినట్లు చెబుతూ, ఎకరం 55 లక్షలకు ఫిక్స్‌ చేశారు.

అయితే, ఈ 115 ఎకరాల్లో 40 ఎకరాలు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులవని తెలుస్తోంది. మిగిలిన 75 ఎకరాలకు సంబంధించి.. రైతుకు రూ.40 లక్షలు, తమకు కమీషన్‌ రూ.15 లక్షలు వచ్చేలా కొందరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. అందుకు సమ్మతించిన రైతుల భూములనే సేకరించారని, అంగీకరించని రైతులకు చెందిన 30 ఎకరాలను వదిలేశారని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే, కావలి భూముల్లో కుంభకోణం జరుగుతోందని ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు దీనిపై దృష్టి సారించారు. ఫైలు తన వద్దకు వచ్చినా పట్టించుకోలేదు. సంతకం చేస్తే ఇరుక్కుపోవడం ఖాయమనే ఉద్దేశంతో ఫైలును పక్కన పెట్టారు. దీంతో అధికార పార్టీ నేతలు కలెక్టర్‌ పై ఒత్తిడి తీసుకొచ్చారట. 'ఫైలు మీద సంతకం పెట్టు.. లేదంటే సెలవుపై వెళ్లిపో' అని బెదిరించడంతో ఆయన లీవ్‌లో వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇంతలో కలెక్టర్‌ను బదిలీ చేయాలని ప్రతిపాదన రావడం, ప్రభుత్వం బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి.

మరోవైపు, కొత్త కలెక్టర్‌ రాకముందే కావలి భూ బాగోతానికి సంబంధించిన పని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఎకరం భూమికి రూ.50 లక్షలు సిఫారసు చేస్తూ జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు మరో అధికారి ద్వారా తమకు కావలసిన పని పూర్తి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.