English | Telugu
మానవ తప్పిదమా? టెక్నికల్ సమస్యా? ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయి?
Updated : Nov 12, 2019
కాచిగూడలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ పై రైల్వే అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకే ట్రాక్‌పైకి ప్యాసింజర్ రైలు... ఎంఎంటీఎస్ ట్రైన్ రావడంపై విచారణ మొదలుపెట్టారు. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నప్పటికీ, మానవ తప్పిదమే కారణంగా తెలుస్తోంది. కర్నూలు-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు సిగ్నల్ ఉండగా, ఆ ట్రాక్ పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎలా వచ్చిందనే దానిపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసం కావడం... లోకో పైలట్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడం... దాదాపు 8గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత... అతికష్టంమీద బయటికి తీసి ఆస్పత్రికి తరలించడంతో... లోకో పైలట్ కోలుకుంటేనే అసలేం జరిగిందనేది క్లారిటీ వస్తుందని రైల్వే అధికారులు అంటున్నారు.
టెక్నికల్ సమస్యో... లేక మానవ తప్పిదమో తెలియదు గానీ... రెండు రైళ్ల స్పీడు తక్కువగా ఉండటంతో... ప్రాణనష్టం తప్పింది. అయితే, సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు... భయంతో వణికిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తలో దిక్కుకు పరుగెత్తారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో మొత్తం బోగీలన్నీ పట్టాలు తప్పగా... మూడు కోచ్ లు మాత్రం అమాంతం గాల్లో పైకి లేచి కిందపడటంతో... అసలేం జరిగిందో తెలియక హడలిపోయారు. తలో దిక్కుకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఎదురుగా వస్తోన్న కర్నూలు ఎక్స్ ప్రెస్ వేగం చాలా నెమ్మదిగా ఉండటం.... అలాగే ఎంఎంటీఎస్ ట్రైన్ వేగం కూడా ఒక మోస్తరుగా ఉండటంతో... పెను ప్రమాదం తప్పింది. లేదంటే, ప్రాణనష్టం ఊహించనిస్థాయిలో ఉండేదని అధికారులు చెబుతున్నారు.
ఇక, ఎంఎంటీఎస్ కేబిన్ లో ఇరుక్కుపోయిన లోకో పైలట్ ను బయటికి తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గ్యాస్ కట్టర్ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించి లోకో పైలట్‌ను సురక్షితంగా బయటికి తీశారు. అయితే, కేబిన్‌లో ఇరుక్కుపోయిన లోకో పైలట్ ... నరకయాతన అనుభవించాడు. ఎటూ-కదల్లేక, ఊపిరాడక, అల్లాడిపోయాడు. దాంతో, ఒకపక్క ఆక్సిజన్ అందిస్తూ... మరోవైపు డీహైడ్రేట్ కాకుండా సెలైన్ ఎక్కిస్తూ, 8గంటల భారీ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత క్షేమంగా బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మొత్తం 30మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.