English | Telugu

వామ్మో రఘునందన్... అత్యాచార ఆరోపణలు నిజమేనా?

చట్టాలు, రూల్సూ రెగ్యులేషన్స్, నీతి నిజాయితీ, నిబంధనలు అంటూ మాట్లాడే తెలంగాణ బీజేపీ నేత ఎం.రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పొలిటికల్ లీడర్ కంటే ముందుగా రఘునందర్ రావు లాయర్ కావడంతో ఆ మహిళ చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. బీజేపీ నేత, లాయర్ రఘునందన్ రావు తనపై అత్యాచారం చేశాడంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కి మహిళ ఫిర్యాదు చేసింది. విడాకుల విషయంలో తనను ఆఫీసుకు పిలిచిన రఘునందర్ రావు... మత్తు మందు కలిపిన కాఫీ ఇచ్చి... ఆ తర్వాత అత్యాచారం చేశాడని మహిళ ఆరోపిస్తోంది. తనపై అత్యాచారం చేస్తున్నప్పుడు తీసిన వీడియోను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది. రఘునందన్ రావు దురాగతంపై ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశానని తెలిపిన బాధితురాలు.... తనకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కోరింది.

అయితే, తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆ మహిళ ఫిర్యాదు చేసిందని బీజేపీ నేత రఘునందన్ రావు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించేవారిపై కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే తనపై ఎవరో ఈ ఫిర్యాదు చేయించారని రఘునందన్ చెబుతున్నారు. హెచ్ ఆర్సీ నుంచి ఫిర్యాదు పత్రాల కాపీని తీసుకుని మహిళ ఆరోపించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు.

అయితే, ఓ మహిళ తనపై రఘునందన్ అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నాడని... హెచ్ఆర్సీని, పోలీస్ కమిషనర్ ఆశ్రయించిందంటే అసలేమీ నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటున్నారు. ఒకవేళ ఆ మహిళ ఆరోపణలు నిజమైతే రఘునందన్ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. అయితే, దిశ ఘటన జరిగినప్పుడు మీడియా డిబేట్స్ లో నీతి వ్యాక్యాలు వల్లివేసిన రఘునందన్ రావుపై... ఓ మహిళ... తనపై అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి బెదిరిస్తున్నాడని ఆరోపించడం మాత్రం కలకలం రేపుతోంది.