English | Telugu
జగన్ లాగా ఒక్క ఛాన్స్ అంటున్న మోడీ... మరి, ఇస్తారో లేదో?
Updated : Feb 4, 2020
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. అధికార ఆప్... అపోజీషన్ బీజేపీ... ఇంటింటి ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. సభలు, ర్యాలీలతో రెండూ పార్టీలూ హోరాహోరీగా క్యాంపైనింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నప్పటికీ... పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ అండ్ బీజేపీ మధ్యే సాగుతోంది. అయితే, సర్వే సంస్థలన్నీ మళ్లీ ఆప్ దే అధికారమని చెబుతున్నా... ఈసారి మాత్రం ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ముందుకెళ్తోంది. అందుకే, సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్న కమలనాథులు... టాప్ లీడర్స్ ను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ.... బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ రాజధాని ప్రజలను కోరారు. అభివృద్ధిని, మార్పును కోరుకుంటున్న ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్న నరేంద్రమోడీ... ఒక్క అవకాశమిస్తే... డెవలప్ మెంట్ అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తామన్నారు. బీజేపీని గెలిపించండి... అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానంటూ ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ మొత్తం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు పౌర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఢిల్లీ ప్రజల ఓటు... దేశంలో తమ ప్రభుత్వం చేపడుతున్న మార్పులకు బలం చేకూర్చేలా ఉండాలని మోడీ సూచించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం మార్పు కోసం ఫిబ్రవరి ఎనిమిదిన ఓటుతో బీజేపీకి, ఎన్డీఏకి పట్టం కట్టాలని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తే ఢిల్లీని అభివృద్ధిచేసి చూపిస్తామన్నారు.