English | Telugu

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలు ఆత్మహత్యాయత్నం

భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్.. మంగళవారం ఉదయం తమిళనాడులోని వెల్లూరు జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన జైలు అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె లాయర్ పుహళేంది తెలిపారు. అయితే నళిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను జైలు అధికారులు సరిగా చెప్పడం లేదని, అసలు నిజాలను వారు కప్పిపుచ్చుతున్నారని లాయర్ ఆరోపించారు.

తోటి ఖైదీకి, నళినికి మధ్య జైలులో గొడవ జరిగిందని, గొడవతో కలత చెందిన నళిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు జైలు అధికారులు చెబుతున్నారని లాయర్ పేర్కొన్నారు. అయితే ఖైదీల మధ్య ఇలాంటి తగాదాలు సర్వసాధారణమని, ఈ కారణానికి ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉండకపోవచ్చని లాయర్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు. దీని వెనుక మరింత దర్యాప్తు అవసరమని లాయర్ సూచించారు. త్వరలోనే ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది వివరించారు.