English | Telugu

అందరిని మందలించి.. తానే మాస్కు తీసేశారు! చిరుకి కరోనాపై ఆర్ఆర్ఆర్ రియాక్షన్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంపై స్పందించారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. కరోనా అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి అనేక ప్రకటనలు ఉచితంగా చేసిన చిరంజీవి గారు ఇప్పుడు తానే కరోనా బారినపడడం దురదృష్టకరం అని ఆయన ట్వీట్ చేశారు. మాస్కులు ధరించాలంటూ చిరంజీవి అనేకమంది హీరోయిన్లను మందలించడం చూశామని, కానీ ఆయన ఒక్కసారి మాస్కు తీసి కనిపించాడని, కరోనా వచ్చేసిందని వ్యాఖ్యానించారు. చిరంజీవిని పరామర్శించేందుకు కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదన్న రఘురామకృష్ణరాజు,. అందుకే ట్వీట్ పెట్టానని వివరించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు.

ఇక చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని కోరకుంటూ సినీ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. చిరంజీవిగారూ.. త్వరగా కోలుకోండి. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. జాగ్రత్తగా ఉండండి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని రవితేజ స్పందించారు. చిరంజీవి సర్.. మీరు కరోనాను జయించి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానని నిఖిల్ ట్వీట్ చేశారు. చిరంజీవి సర్ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యవంతులుగా తిరిగి రండి. మిమ్మల్ని మేమందరం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటామన్నారు దేవిశ్రీప్రసాద్.