English | Telugu

విజయనగరంలో పైడితల్లి అమ్మ వారి పండుగలో కీలక ఘట్టం ప్రారంభం...

విజయనగరంలో పైడితల్లి అమ్మ వారి పండుగ వైభవంగా జరుగుతుంది. పైడితల్లి అమ్మ వారి పండుగ నెల రోజుల పాటు ఘనంగా జరుపుతారు. అయితే నెలరోజుల పాటు జరిగే ఈ అమ్మవారి పండుగలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఇవాళ తోలేళ్ల ఉత్సవం ప్రారంభం కాగా రేపు సిరిమాను సంబరం జరగనుంది.

పైడితల్లి అమ్మవారు రాజవంశీయులైన పూసపాటి గజపతుల ఆడపడుచు కావడంతో జాతరలో వారి వారసులు పట్టు వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ప్రస్తుత ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజు అనారోగ్యం కారణంగా పండగకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కుమార్తె ఆదితి గజపతి రాజు రాజవంశీయుల తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలతో ఆలయానికి చేరుకున్న ఆదితి గజపతి రాజుకు వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అదితి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అశోక్ గజపతి రాజు ఆరోగ్యం మెరుగవుతోందని త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఉంటారని అదితి అన్నారు. అదే విధంగా ఈరోజు తోలేళ్ళ ఉత్సవం అని రేపు సిరిమాన్ ఉత్సవం జరగనుందని తెలిపారు. ఈరోజు, రేపు పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరగాలని, విజయనగరం ప్రజలందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ, అందరికీ పైడితల్లి అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.