English | Telugu

సీఎంవోలో ఇద్దరు అవుట్! ఆయన కోసమే పొగబెట్టారా? 

ఇప్పటి వరకూ వాళ్లిద్దరు సూపర్‌ బాస్‌లు. సీఎంవోలో వారికే ఎదురు లేదు. అధికారులకు వారి మాటే శాసనం. అంతటి స్థాయిలో చక్రం తిప్పిన వాళ్లిద్దరు ఇప్పుడు ఆ పోస్టుల నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. సీఎంవో కీలక అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ తో పాటు సీఎంకు సలహాదారుగా ఉన్న పీవీ రమేశ్ లు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారనే ప్రచారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ ఏరికోరి పెట్టుకున్న ఇద్దరూ ఒకేసారి సీఎంవోనూ వీడుతుండటం చర్చనీయంశంగా మారింది. ఏపీ సీఎంవోలో మార్పులపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వారే పోతున్నారా లేక పొయ్యేలా పొగ్గబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొయ్యేలా పొగబెట్టారనుకుంటే.. ఇంతకాలం అందలం ఎక్కించి సడెన్ గా ఎందుకు వారిని టార్గెట్ చేశారనే చర్చ వస్తోంది.

సీఎం జగన్ సలహాదారుగా ఉన్నా పీవీ రమేశ్‌ను ప్రభుత్వం కొంతకాలంగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆయనకు అప్పగించిన శాఖలన్నింటినీ గత జూలైలో తీసేసింది. దళిత అధికారి అయినందుకే శాఖలు తీసేశారన్న విమర్శలు రాకుండా ఉండేందుకు.. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం వద్ద ఉన్న శాఖలను కూడా తీసేశారు. అయితే ఆ తర్వాత తీసేసిన శాఖలను కల్లంకు అప్పగించారు. పీవీ రమేశ్‌ను మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ వైఖరితోనే రాజీనామా చేయాలనే నిర్ణయానికి పీవీ రమేష్ వచ్చినట్లు చెబుతున్నారు. అజయ్ కల్లం కోసమే తనను పట్టించుకోవడం లేదనే భావనలో పీవీ రమేష్ ఉన్నారని తెలుస్తోంది. తాను సలహాదారు పదవి నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు సీఎంకు చెప్పారని.. సీఎం జగన్‌ సానుకూలంగా తలూపి రమేశ్ ను పంపించివేశారని తెలిసింది. దీంతో ఈ నెలాఖరున పీవీ రమేశ్‌ సలహాదారు పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

సీఎంవోలో తన శాఖలను కత్తిరించినప్పటి నుంచి రమేశ్ అసంతృప్తిగానే ఉన్నారని చెబుతున్నారు. గత జూలైలో ఆయన చేసిన ట్వీట్ కూడా ఇందుకు బలాన్నిచ్చింది. ఐఏఎస్ లపై పంజాబ్ కు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ చేసిన ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు పీవీ రమేశ్. అది అప్పుడు సంచలనమైంది. మన దేశంలో అఖిల భారత సర్వీసులకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. ఓ కుటుంబంలో ఏఐఎస్ సర్వీసుకు ఒకరు ఎంపికైనా కొన్ని తరాల వరకూ చెప్పుకునే వారు. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. అలాంటి బ్యూరోక్రాట్లు కొన్నేళ్లుగా రాజకీయ విష వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీరికి చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో వీరు పోషించిన పాత్రను బట్టే ప్రస్తుత స్ధానాలు నిర్ణయం అవుతున్నాయి. దీంతో వారిలో అసంతృప్తి కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని పంజాబ్ కు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ ట్వీట్ చేయగా..పీవీ రమేష్ దీన్ని రీట్వీట్ చేశారు. ట్వీట్ ద్వారా తన అసంతృప్తిని రమేశ్ వ్యక్తం చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పీవీ రమేష్ కు ప్రభుత్వ వర్గాల్లో సమర్ధుడిగా మంచి పేరుంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వర్తించిన క్లీన్ రికార్డు ఆయనది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఆయన కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా జగన్ సీఎంవోలో ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరుగా, కీలకమైన విద్య, వైద్యం వంటి శాఖల బాధ్యతలు చూశారు. గతేడాది కాలంగా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు నీతి ఆయోగ్ వంటి సంస్ధల వద్ద కూడా ప్రభుత్వ గళాన్ని గట్టిగా వినిపించారు. ప్రభుత్వం తరఫున కరోనా సహాయక చర్యలనుపర్యవేక్షించారు. కానీ పలు కారణాలతో జగన్ సర్కారు ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించింది. దీన్ని పీవీ రమేష్ అవమానంగా భావించారని,, అందుకే అందివచ్చిన ట్వీట్ రూపంలో తన అసంతృప్తి వెళ్లగక్కారని ప్రచారం జరిగింది.

ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టిన తరువాత కొద్ది కాలానికే సీఎంవో ముఖ్య కార్య‌ద‌ర్శిగా, జీఏడీలోనూ కీల‌క అధికారిగా ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్ర‌వీణ్ ప్ర‌కాష్ నడిపించారు. అయన ఆదేశాలతోనే అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంను కూడా అర్ధాంత‌రంగా తొల‌గించారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్ర‌వీణ్ ప్ర‌కాష్ సీఎంవో బాధ్య‌త‌ల నుండి త‌ప్పుకుని కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. అయితే చాలా కాలం కేంద్ర స‌ర్వీసుల్లో ప‌ని చేసిన ప్రవీణ్ ప్రకాష్.. జగన్ సీఎం అయ్యాకే ఏపీకి వ‌చ్చారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండగా రాష్ట్ర స‌ర్వీసుల్లోకి రాగా… ఆయనను ఏపీ భ‌వ‌న్ రెసిడెంట్క‌మిష‌న‌ర్ గా నియమించారు. జగన్ సీఎం అయ్యాక ఆయనను సీఎంవో ముఖ్య కార్యదర్శిగా.. అలాగే జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రభుత్వంలో ఆయన మాటే వేదవాక్కుగా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్ర‌వీణ్ ప్ర‌కాష్ తప్పుకోవడం ప్రాధన్యత సంతరించుకుంది. సీఎంవోలో సీఎం ముఖ్య సలహాదారుగా ఉన్న అజయ్ కల్లంతో ఆయనకు పడటం లేదని, అందుకే ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నారని చెబుతున్నారు.