English | Telugu

టీఆర్‌ఎస్‌ కొత్త ఎత్తుగడ.. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ!!

తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ను పలు రకాలుగా దెబ్బకొట్టిన టీఆర్ఎస్.. ఇప్పుడు మరో గట్టి దెబ్బ కొట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుని కాంగ్రెస్ కి పూర్తిగా దూరం చేసే ఎత్తుగడ వేస్తుందని సమాచారం.

పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసింది, ఏఐసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టింది, ఇలా ఎన్నో పదవులు కట్టబెట్టింది. కానీ చివరిరోజుల్లో పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబీకుల్లో, అభిమానుల్లో ఉంది. దానికితోడు, ఇప్పుడు ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించి.. పీవీని గౌరవించడంలో టీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్.. పార్టీ తరఫున ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పినా ఆదరణ కరువైంది. ఓ రకంగా పీవీ సెంటిమెంటుతో టీఆర్ఎస్ పీవీ కుటుంబీకులకి, అభిమానులకి దగ్గరైంది. ఇప్పుడు మరో ఎత్తుగడతో పీవీని కాంగ్రెస్ కి పూర్తిగా దూరం చేయడానికి టీఆర్ఎస్ సిద్దమైందని తెలుస్తోంది.

పీవీ కుమార్తె సురభి వాణిదేవికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆఫర్‌ చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పదవీ కాలమూ పూర్తవుతోంది. ఈ మూడు స్థానాలూ గవర్నర్‌ కోటాలోవే. నాయిని నర్సింహా రెడ్డి, కర్నె ప్రభాకర్‌లను రెన్యువల్‌ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. అయితే, మూడో సీటుకు అనూహ్యంగా పీవీ కుమార్తె పేరును పార్టీ అధిష్ఠానం తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా, పీవీ సెంటిమెంటుతో కాంగ్రెస్ ను మరింత దెబ్బ కొట్టొచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.