English | Telugu

నిందల పాలైన పూజారి ఆత్మహత్య...

నిత్యం దేవుడికి దీప ధూప నైవేధ్యాలు పెట్టే పూజారిని దొంగను చేశారు, ఆలయం నుంచి తొలగించి నవ్వులపాలు చేశారు. తనపై దొంగతనం నేరం మోపడంతో ఆ పూజారి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లిలోని శివాలయంలో ధనుంజయచార్యులు పూజారి గా పని చేస్తున్నాడు. అయిదు నెలల క్రితం హుండీ లోని ముప్పై వేల రూపాయలు చోరీకి గురయ్యాయి, ఆ డబ్బును ధనుంజయ్ చార్యులే కాజేసినట్టు ఆరోపణలొచ్చాయి.

ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది, ఆలయ పూజారిగా ధనుంజయ్ చార్యులను తొలగించారు. అప్పట్నుంచీ శివాలయాన్ని నిర్మించిన కాశయ్య అనే వైద్యుడు ధనుంజయ్ చార్యులపై తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ధనుంజయచార్యులు తాగుబోతని, పౌరోహిత్యం రాదని కాశయ్య అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. దీంతో ధనుంజయచార్యులను పూజలకు పిలవడం మానేశారు, అప్పట్నుంచీ ధనుంజయచార్యులకు కుటుంబ పోషణ కష్టంగా మారింది.

తనపై దొంగతనం నేరం మోపడంతో పాటు తప్పుడు ప్రచారం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ధనుంజయచార్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీశాడు, హుండీ చోరీ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణాలేంటో సెల్ఫీ వీడియోలో చెప్పాడు. ధనుంజయ్ చార్యులకు భార్య, ఆరు నెలల కొడుకు ఉన్నారు, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటంటూ మృతుడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. మృతుని బంధువులు వైద్యుడు కాశయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ధనంజయ్ చార్యుల ఆత్మహత్యకు కారణమైన కాశయ్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.