English | Telugu

ఆర్టీసీ సమ్మెతో  మిన్నంటిన కూరల ధరలు...

ఆర్టీసీ సమ్మెతో కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు రాష్ట్రంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఒక వైపు, ఆర్టీసీ సమ్మె మరోవైపు దీంతో సామాన్యులకే కాదు మధ్య తరగతి వారిని సైతం బెంబేలెత్తిస్తున్నాయి కూరగాయల ధరలు. ఏం కొనాలి, ఏం తినాలి అనే ఆలోచనలో సగటు మనిషి ఉన్నాడు. గత పదకొండు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభావంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు ఉల్లి మాత్రమే కంట తడి పెట్టిస్తే తాజాగా అన్ని కూరగాయలు సగటు మనిషికి గాయాలు చేస్తున్నాయి. కొండెక్కి కూర్చున్నాయి. ఎంతలా అంటే సామాన్యునికి అందనంత ఎత్తున పైపైకి ఎగబాకుతున్నాయి. చిక్కుడుకాయ పోయి ఎక్కడో ఉంటే టమాటా మోత మోగిస్తోంది. ఇక మామూలు రోజుల్లో పది రూపాయలకు కిలో దొరికే వంకాయలు సైతం నేడు అరవై రూపాయల దాటింది. పెరిగిన ధరలతో వినియోగదారులతో పాటు కూరగాయల వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఆకుకూర ధర మాత్రం కిలోకు వంద రూపాయలకి వెళ్లిన నేపథ్యంలో వినియోగదారులు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తుతున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ఆటోలు కూడా ప్యాసింజర్ ఫీజు నేపథ్యంలో కొంతవరకు రవాణాపైనే ప్రభావం చూపి కూరగాయల ధరల పై ప్రభావం పడి ఎనభై, వందకు అమ్ముతున్నారు.సామాన్య ప్రజలు కూరగాయలు కొనేట్టు లేవని వాపోతున్నారు. ఆర్టీసి సమ్మె కారణంగా కూరగాయలను తరలించేందుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైన సమ్మె జరిగితే నిత్యావసరాల ధరలకూ రెక్కలొస్తాయి.ఎప్పుడు ఇలాంటి సమ్మేలకు సామాన్యులే బలవుతారు. సాధారణంగా ఇప్పుడు కూరగాయలకు కూడా క్రాప్ అంతా చేతికి వచ్చి పరిస్థితి కనిపిస్తుంది కానీ రవాణా సక్రమంగా లేకపోవడం చేత రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు బాధితులు.