English | Telugu

సంక్షోభ పరిష్కర్త.. భారత రాజకీయాల్లో భీష్మాచార్యులు

విపక్షాలను సైతం మెప్పించిన నేత

ప్రణబ్ ముఖర్జీ

(11 డిసెంబర్ 1935 - 31 ఆగస్టు 2020)

మాజీ రాష్ట్రపతి, సీనియర్ కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. అర శతాబ్దం పైగా దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా నెహ్రు కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక కీలకపదవులను ఆయన నిర్వహించారు. పార్టీలో అంతర్గత సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటిని చాకచక్యంతో ఆయన సరిదిద్దేవారు. అందుకు ఆయనను సంక్షోభ పరిష్కర్త, భీష్మాచార్య అంటూ నాయకులు ప్రేమగా పిలుచుకునేవారు. ఆయన సేవలను కాంగ్రెస్ నేతలే కాదు దేశప్రజలంతా గుర్తుంచుకుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నియమించిన కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. తెలుగు రాష్ట్రల విభజనలోనూ కీలకపాత్ర పోషించారు.

ప్రణబ్ ముఖర్జీ 11 డిసెంబర్ 1935లో పశ్చిమబెంగాల్ లోని మిరాఠీ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి ముఖర్జీ, తండ్రి కమద కింకర ముఖర్జీ దేశ స్వాతంత్య్రపోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఆయన 1952 నుంచి 1964 వరకు పశ్చిమబెంగాల్ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు.

ప్రణబ్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో, చరిత్రలో ఎం.ఎ, ఆ తర్వాత ఎల్ఎల్ బి పూర్తిచేశారు. కలకత్తాలోని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో యుసిడిగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత అధ్యాపకునిగా పనిచేశారు. అంతేకాదు రాజకీయాలకు రాకముందు దేషెర్ దక్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు.

1969లోరాజకీయాల్లోకి..
తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. 1969లో మిడ్నాపూర్ ఉపఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకు పార్టీకి విధేయుడిగా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నమ్మిన బంటుగా పార్టీలో పేరు తెచ్చుకున్న ఆయన 34ఏండ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికైయ్యారు. ఆ తర్వాత 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1975,1981,1993,1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ పార్టీకి అండగా ఉన్నారు. 1998లో సోనియా పార్టీ అధ్యక్షురాలు కావడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.

2004లో తొలిసారి..
అనేక సార్లు రాజ్యసభకు నామినేట్ చేయబడిన ప్రణబ్ ముఖర్జీ 2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో నెంబర్ 2గా గుర్తింపు పొందారు. కేంద్రంలో కీలకమైన రక్షణ, విదేశాంగ, ఆర్థిక, వాణిజ్య శాఖలు నిర్వహించిన ప్రణబ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకెవరూ సాటి రారని విపక్ష నేతలు సైతం ఆయన సేవలను కొనియాడతారు.

13వ రాష్ట్రపతిగా..
2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 70 శాతం ఓట్లను పొంది ప్రత్యర్థి పి.ఎ.సంగ్మాను ఓడించారు. భారత దేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికయ్యారు. 25 జూలై 2017న రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే తిరిగి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించినా ఆయన ఆరోగ్య సమస్యలరీత్యా రాజకీయాల నుండి పదవీ విరమణ చేయాలని భావించారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉంటూ సూచనలు ఇవ్వాలని అధిష్టానం కోరడంతో ఆయన పార్టీలోనే కొనసాగారు. చివరివరకు కాంగ్రెస్ పార్టీ నేతగానే ఉన్నారు.