English | Telugu

వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని కడపకు తరలించారు. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. అదే విధంగా వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్ది సేపు ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను కడపకు తరలించారు. అలాగే తెలుగుదేశం, వైసీపీకి చెందిన పలువురు నేతలను కూడా అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. పులివెందులలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144వ సెక్షన్ విధించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు, ఓటర్లు తన ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా పులివెందుపైనే ప్రధాన పార్టీలు రెండూ దృష్టి సారించాయి. పులివెందుల మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం కూటమి, వైసీపీ కూడా ఈ జడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇరు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచార సమయంలోనే ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా.. పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సతీమణిమారెడ్డి లతారెడ్డి రంగంలో ఉండగా, వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో సహా మొత్తం 11 మంది బరిలో ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీల మధ్యే ఉంది.