English | Telugu
ఎపి సీఎం హద్దులు దాటారు.. చర్యలు తీసుకోండి.. సుప్రీం కోర్టులో పిటిషన్
Updated : Oct 13, 2020
న్యాయస్థానాలను కించపర్చేలా వ్యవహరించినందుకు ఏపీ సీఎంకు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా పిటిషనర్ సుప్రీం కోర్టు ను కోరారు. న్యాయమూర్తులను భయాందోళనకు గురిచేసేలా జగన్, ఆయన పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ చర్యల వల్ల న్యాయస్థానాలపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం వుందన్నారు. కాబట్టి న్యాయవ్యవస్థను కాపాడాలని...భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని సునీల్ కుమార్ సింగ్ తన పిటిషన్ లో కోరారు.
ఈ నెల 10న ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశాన్ని ఆయన తన పిటిషన్ లో ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు జగన్ ఓ లేఖ రాశారని, అందులో తదుపరి సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న మరో న్యాయమూర్తి ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేశారని అయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీల పై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని సునీల్ కుమార్ సింగ్ తెలియజేశారు. తన చర్యల ద్వారా వైఎస్ జగన్ "దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని" చూస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు.