English | Telugu

హైదరాబాద్ - కర్నూలు హైవే పై ఉన్న బార్లను మూసేయండి

44 వ నెంబరు నేషనల్ హైవే పై దిశ దారుణం జరిగింది. హైదరాబాద్ కు దక్షిణంగా శంషాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు అలంపూర్ టోల్ గేట్ వరకు దాదాపు 200 కిలో మీటర్లు ఈ రహదారి విస్తరించింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో ఈ హైవే ఉంది. ఇక 44 వ నేషనల్ హైవే పరిధిలో షాద్ నగర్, బాదేపల్లి, భూత్పూర్ , కొత్తకోట , పెబ్బేరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మునిసిపాలిటీల్లో మద్యం షాపులు లేనప్పటికీ హైవేలకు కాస్త దూరంగా ఉన్న గ్రామాల్లో మద్యం షాపులున్నాయి. హైవే పక్కన ఉన్న వైన్ షాపులన్నీ బార్లుగా మారాయి. వైన్స్ లో లిక్కర్ కొని విచ్చలివిడిగా హైవే పక్కన ఖాళీ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తున్నారు. హైవేల పై ఉన్న వైన్స్ లోనే కాదు, దాబాల్లోనూ లిక్కర్ దొరుకుతోంది. ప్రతి దాబా ఓ బెల్టు షాపులా మారింది. జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకు, కొత్తపేట, పెబ్బేరు, కోదండాపురం ప్రాంతాల్లో ఉన్న దాబాలు అన్నింటిలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో గొడవలు కూడా పెరిగాయి. హైవేల పై నిఘా కరువైందనే ఆరోపణలున్నాయి. ఎక్కడైనా లారీలు, వాహనాల గుంపుగా ఉంటే ఖచ్చితంగా అక్కడికీ హైవే పెట్రోలింగ్ వాహనం వెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో దృష్టి పెట్టాలన్నారు. కానీ అధికారులు పట్టించుకోక పోవడంతో మద్యం బాబుల ఆగడాలు నేరాలు పెరుగుతున్నాయి అంటున్నారు స్థానికులు. హైవేల పై మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు. లిక్కర్ అమ్మకాల విషయంలో చట్టాలు కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కఠిన చట్టాలు తెచ్చినప్పుడే నేరాలు తగ్గుతాయని అంటున్నారు.