English | Telugu

ఆలయాన్ని కూల్చివేయండి లేదా 5 కోట్లు చెల్లించండి: హైకోర్టు

పార్కును ఆక్రమించి ఆలయం నిర్మించడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్న మూడు కోట్లమంది దేవతలకు ఇలా పబ్లిక్ స్థలాలను ఆక్రమించి గుడులు కట్టుకుంటూ పోతే పరిస్థితేంటి అని నిలదీసింది. గుడిని కూల్చేస్తారా లేక ఐదుకోట్లు చెల్లిస్తారా అంటూ అమీన్ పూర్ ఆలయ కమిటీని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం మాధవపురి హిల్స్ లోని రాక్ గార్డెన్ లో 9866 చదరపు గజాల స్థలాన్ని కబ్జా చేసి అనుమతి లేకుండా ఆలయాన్ని నిర్మించడాన్ని ప్రశ్నిస్తూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ట్రస్ట్ 2018 లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హై కోర్టులో మరోసారి విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా ఆలయంలోని దేవుడ్ని ప్రతివాదిగా చేర్చాలని ధర్మాసనం సూచించింది. ఆలయ కమిటీ తరపున వాదించిన న్యాయవాది 2010 లో ప్రభుత్వం ప్రార్థనా మందిరాలకు సంబంధించిన విధాన నిర్ణయం చేస్తూ రెండు జీవోలు జారీ చేసినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఆలయం పేరుతో పార్కులను కబ్జా చేసుకోడానికి ప్రభుత్వం అనుమతిస్తూ జీవోలు ఇచ్చిందా అని నిలదీసింది.

ఈరోజు ఆలయం నిర్మించారు రేపు గురుద్వార్, మసీదు, చర్చిలు నిర్మిస్తామంటే ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించింది. దేవుడి పేరుతో పార్కు స్థలాన్ని ఆక్రమించి, ఆలయ నిర్మాణాలు చేసి చట్టాలు ఉల్లంఘిస్తుంటే అడ్డుకోవలసిన ప్రభుత్వాధికారులు మౌన ప్రేక్షకుల్లా ఉండిపోతున్నారని అసహనం వ్యక్తం చేసింది. పార్క్ ను ఆక్రమించి ఆలయం కట్టడం కూడా భూ కబ్జా కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిబ్రవరి 26 న జరిగే విచారణకు పురపాలక, పంచాయతీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ ఎం డీ ఏ కమిషనర్, జిల్లా పంచాయతీ ఈవో, అమీన్ పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు చూపాలని కోర్టు అమీన్ పూర్ ఆలయ కమిటీని ఆదేశించింది. 2018 ఆగస్ట్ లో ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. పార్కుల కోసం కేటాయించిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేసింది. ఈ చట్టం ప్రకారం ఏ ఉద్దేశంతో ఆక్రమించినా నేరమే అవుతుందని పేర్కొంది. అక్రమంగా నిర్మించిన ఆలయాన్ని కూల్చివేయటం ఒక్కటే మార్గమని లేదంటే ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆలయ కమిటీకి హైకోర్టు ఆదేశించింది.