English | Telugu

కనిపించని కళ్యాణ్.. కార్యాచరణలో రాజధాని రైతులకు జనసేనాని అండగా ఉంటాడా ?

ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది . మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం నోట వెలువడినప్పటి నుండి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని మార్చొద్దనే డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. రైతులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో జనసేనాని పాల్గొనలేదు. అసలు రైతుల నిరసనలపై కానీ ఆ తర్వాత గానీ మళ్లీ మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు జనసేన కార్యచరణ ప్రకటించటానికి సిద్ధమవుతున్నారు పవన్ . నేడు మంగళగిరిలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు జనసేనాని. ఈ సమావేశానికి పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ , నాగేంద్రబాబులతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు.

ఈ సమావేశం లో ప్రధానంగా ఏపీ రాజధానుల పై చర్చించనున్నారు. రాజధాని తరలింపును జనసేనాని గతంలో వ్యతిరేకించారు. అయితే క్యాబినెట్ భేటీ తర్వాత పవన్ రాజు దానిపై స్పందించలేదు. దీంతో రాజధాని పై జనసేన పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాయలసీమ నేతలు, పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మరోవైపు ఇప్పటికే అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రత్యేకంగా లేఖని విడుదల చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజధాని పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.