English | Telugu
తెలుగు భాషని చంపకండి... జగన్ పై పవన్ విమర్శలు
Updated : Nov 19, 2019
మాతృభాషని , మృతభాషగా మార్చకండి అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు జనసేనని పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది నుండి పూర్తిగా ఇంగ్లిష్ మీడియంను అమల్లోకి తెస్తున్నట్లు జగన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటించిన రోజు నుండే విమర్శలు ఎదురుకుంటున్నారు. ఈ రోజు ఉదయం పవన్ తన అస్త్రాలను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ప్రఖ్యాత భాష శాస్త్రవేత్త ప్రో. గణేష్ ఎండీవి గారు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మీడియం అంశంపై చెప్పిన అభిప్రాయాన్ని షేర్ చేశారు. అదే కాకుండా ప్రముఖ ఆంగ్ల పత్రిక " ది హిందు " ప్రచురించిన " ఇంగ్లీష్ మీడియం పై అబద్ధపు ఆకర్షణ " అనే ఆర్టికల్ ను పోస్ట్ చేసారు.
అదే నేపధ్యంలో.. " ఇంగ్లీషు భాష ని వద్దని ఎవరు చెప్పటం లేదు కానీ, తెలుగుని మృత భాషగా కాకుండా ఏమి చర్యలు తీసుకుంటారో వైసీపీ నాయకుడు’ జగన్ రెడ్డి గారు’ చెప్పాలి. మాతృభాషని, మాండలీకాలని సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే.. " అంటూ తన ఫేస్ బుక్ లో రాశారు. మాతృ భాషను మృత భాషగా మార్చకంటూ జగన్ ని ఉదేశించి మాట్లాడారు. " తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ,తెలుగుని చంపేసే ఆలోచన ,భస్మాసుర తత్వాన్ని సూచిస్తుంది" అని జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.
జగన్ రెడ్డి గారు.. మా తెలుగు తల్లి’ అని పాడాల్సిన మీరు.. తెలుగు భాష తల్లినే’చంపేస్తున్నారంటూ ఆయన చేస్తున్న వైఖరిని గుర్తుచేశారు. ఇప్పటికే తెలుగు మీడియంను తీసేస్తూ జగన్ ఇచ్చిన ఉత్తర్వులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భాష శాస్త్రవేత్తల నుండి భాష ప్రేమికుల వరకు అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నిర్ణయాలు తీసుకోవడం.. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం.. జగన్ గారికి కొత్త కాదని.. ఆయన ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే తనకు తెలియదంటూ చెప్పుకొచ్చాడని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి తెలుగు మీడియం విషయంలో వెనక్కి తగ్గకకపోతే ఇదొక పెద్ద దుమారమే రేపేలా ఉంది. ఆనాడు తెలుగు వాడి ఆత్మగౌరవం అనే అంశం మీదే ఎన్టీఆర్ పార్టీ పెట్టి అఖండ విజయాన్ని సాధించారు. ఈ నాడు అదే తెలుగు అంశం మళ్ళీ రాజుకుంటే అది ఎక్కడికి దారి తీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా జగన్ ఈ విషయంపై పునః ఆలోచన చేస్తారో లేదో వేచి చూడాలి.