English | Telugu

కేసుల భయంతో ఏపీ ప్రయోజనాలపై రాజీ... జగన్ పై పవన్ ఘాటు విమర్శలు...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ ను సీబీఐ కేసుల భయం వెంటాడుతోందన్న పవన్.... అసలు అవినీతి కేసులున్నవాళ్లు ముఖ్యమంత్రి అయితే... రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కేసుల భయంతోనే రాష్ట్ర అవసరాల గురించి, రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నారని పవన్ విమర్శించారు. తనపై ఉన్న కేసుల కారణంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీపడుతున్నారని ఆరోపించారు. ఇక, రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే పారిశ్రామికవేత్తలు భయపడి ఆంధ్రప్రదేశ్ కు రావడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు కోడి కత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. సొంత చిన్నాన్న హత్య కేసు ఏమైందని నిలదీశారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్.... సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారని, మరి ఇప్పుడు ఆ డిమాండ్ ఏమైందని పవన్ ప్రశ్నించారు. ఇక, ఇసుక కొరతతో లక్షలాది మంది కార్మికుల రోడ్డునపడ్డారన్న జనసేనాని... నవంబర్ మూడున విశాఖలో పెద్దఎత్తున నిరసన చేపడతామన్నారు.