English | Telugu

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. సమావేశాలు సఫలం అయ్యేందుకు సహకరించాలని అఖిల పక్ష సమావేశంలో విపక్ష నేతలను మోదీ కోరారు. ఈ మీటింగ్ లో వైసిపి, టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఈరోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష భేటీలో ఇరవై ఆరు రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. పార్లమెంటు సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు నాయకులు తమ వంతు పాత్ర పోషించాలని మోదీ విపక్షాలను కోరారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం తదితర అంశాలను అన్నా డీఎంకే మినహా ఇతర విపక్షాలు ఈ భేటీలో లేవనెత్తాయి. జమ్మూ కశ్మీర్ లో నిర్బంధంలో ఉన్న నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.

అటు అఖిల పక్ష సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ శాసన మండలి రద్దు, రాజధాని మార్పు అంశాలను పార్లమెంట్ లో చర్చించాలని టిడిపి ఎంపీలు పట్టుబట్టారు. దీనిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్ సభ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. రాజధాని మార్పు రాష్ర్టానికి సంబంధించిన విషయమని విజయసాయిరెడ్డి అన్నారు. వెంటనే కల్పించుకున్న టిడిపి ఎంపిలు తాము కేంద్రంతో సంప్రదించిన తర్వాతే అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాదన తీవ్రస్థాయికి చేరింది. గందరగోళం నెలకొనడంతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కల్పించుకుని వైసీపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. టిడిపి ఎంపీల అభిప్రాయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రకటించారు. ప్రస్తావన మాత్రమే తీసుకువచ్చారని సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. ఇది కేవలం చర్చపై జరుగుతున్న సమావేశం మాత్రమేనని చర్చించే అంశాలపై గొడవకు దిగడం సరి కాదని రాజ్ నాథ్ హితవు పలికారు.

రాజధానికి నిధులు ఇవ్వాలని అఖిల పక్ష సమావేశంలో వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు అంటూ విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఏ విధంగా నిధులు అడుగుతారని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కౌంటరిచ్చారు. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి పదకొండు (ఫిబ్రవరి 11) వరకూ కొనసాగుతాయి. విరామం తర్వాత మళ్లీ మార్చి రెండు (మార్చి 2) నుంచి ఏప్రిల్ మూడు(ఏప్రిల్ 3) వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.