English | Telugu
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వేలో దూసుకుపోతున్న 'కారు'........
Updated : Oct 22, 2019
హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే విజయం టిఆర్ఎస్ దే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే అంచనాలు తారుమారు అవుతాయని గెలిచేది తామేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతం గానే ముగిసింది. నియోజక వర్గంలోని ఏడు మండలాల్లో మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో కలిపి ఎనభై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం తగ్గింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించిన వాటి స్థానంలో వేరే ఈవీఎంలు అమర్చి పోలింగ్ నిర్వహించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలంలో గుండ్లపల్లి టిడిపి అభ్యర్థి చావా కిరణ్మై హుజూర్ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మద్యం తాగిన వారిని ఓటింగ్ లో పాల్గొననివ్వమని అధికారులు ముందే హెచ్చరించటంతో మందు బాబులు కనిపించలేదు. వృద్ధులూ, దివ్యాంగులూ,వృద్ధులు హుషారుగా పోలింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉత్తమ్ చేసిన అభివృద్ధి, పార్టీ ఓటు బ్యాంకు, నాయకులు కలిసి కట్టుగా ప్రచారం చేయడం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు ఏడు వందల మంది నాయకుల సైన్యం పదిహేను రోజుల పాటు ప్రతి ఓటరును పలకరించడం, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు చివరి రెండు రోజుల్లో తిరుగులేని పోల్ మేనేజ్ మెంట్ కారణంగా ఆధిపత్యం తమదేనని అధికార టీఆర్ఎస్ పూర్తి నమ్మకంతో ఉంది. వర్గాల వారీగా ఓటర్ల ఆకర్షణకు చివరి రెండు రోజుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి అధికార పార్టీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. అధికార పార్టీ చేసిన పోల్ మేనేజ్ మెంట్ ముందు విపక్ష కాంగ్రెస్ విలవిలలాడినట్లు కనిపించింది.
ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే అనుకూల ఫలితాలు రావడం సర్వసాధారణం. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా అన్ని పలితాలు అధికార టీఆర్ఎస్ కు అనుకూలం గానే ఉన్నాయి. చాణక్య ఎగ్జిట్ పోల్ లో టిఆర్ఎస్ కు యాభై మూడు శాతం, కాంగ్రెస్ కు నలభై ఒకటి శాతం, టిడిపికి రెండు పాయింట్ ఒకటి శాతం, బీజేపీకి ఒకటి పాయింట్ ఒకటి శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆరా అనే ఏజెన్సీ చేసిన సర్వేలో టీఆర్ఎస్ కు యాభై పాయింట్ నాలుగు ఎనిమిది శాతం, కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం, ఇతరుల కు తొమ్మిది పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు పోలవుతాయని తెలిపింది.వీసీపీ అనే సంస్థ టీఆర్ఎస్ కు యాభై ఏడు పాయింట్ ఏడు మూడు శాతం, కాంగ్రెస్ కు నలభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం, టీడీపీకి రెండు పాయింట్ రెండు ఒకటి శాతం, బీజేపీకి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం, ఇతరులకు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రీసెర్చ్ అండ్ అనాలసిస్ పై పబ్లిక్ పల్స్ అనే సంస్థ టీఆర్ఎస్ కు నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతం, కాంగ్రెస్ కు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది, టిడిపికి నాలుగు పాయింట్ ఎనిమిది, బీజేపీకి రెండు పాయింట్ నాలుగు, ఇతరులకు ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.హుజూర్ నగర్ లో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని పోలింగ్ ముగిసిన వెంటనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
పార్టీ విజయం కోసం కష్టపడిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో ఒక్కొక్క మండలంలో ప్రజల తీర్పు ఒక్కో విధంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పాలకవీడు, హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చే అవకాశముండగా, మిగిలిన మండలాల్లో టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉద్యోగులు, నిరుద్యోగులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు చెబుతున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావం పరిమితమైన అని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రంలో చాలా చోట్ల ప్రభావాన్ని చూపిన ట్రక్కు గుర్తుపై పోలింగ్ తర్వాత చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో హుజూర్ నగర్ లో కూడా ట్రక్కు గుర్తుకు ఆరు వేలకు పైగా ఓట్లొచ్చాయి. ఈ సారి ట్రక్కు గుర్తుకు రోడ్ రోలర్ కూడా జతయ్యింది. ఈ గుర్తులు ఎన్ని ఓట్లను కొల్లగొడతాయో అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ఫలితాల కోసం మరో రెండు రోజులు వేచి చూడాలి.