English | Telugu
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్న అభ్యర్థులు!
Updated : Mar 6, 2020
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అనర్హత వేటు పడేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ప్రతిపక్షాలు హడలిపోతున్నాయి. ప్రభుత్వం అనుకుంటే ఎలాగైనా ఇరికించి జైలుకు పంపిస్తుందనే భయం పోటీ చేయాలనుకునే అభ్యర్థులను వెంటాడుతుందట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచవద్దు. పంచినట్లు రుజువు అయితే ఆ అభ్యర్థి గెలిచినా జైలుకు వెళ్ళడం తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు మద్యం ఎలా పంచుతారు. మందుషాపులన్నీ ప్రభుత్వ అజమాయిషీలోనే నడుస్తున్నాయి. జనం లైన్‌లో నిలబడి మందు కొంటున్నారు. కాబట్టి ప్రత్యపక్షాలకు మందు పంచే అవకాశం ఈ ఎన్నికల్లో వుండకపోవచ్చు. ఇటీవల ఎపి ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేసి, ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వేసిన సెటైర్లపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అమ్మో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం. గెలిచినా చట్టాన్ని ఉపయోగించుకొని జైలుకు పంపిస్తారు. ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఎవరైనా తాను ఫలానా అభ్యర్థి వద్ద డబ్బు తీసుకొని ఓటు వేసినట్లు ఫిర్యాదు చేస్తే, గెలిచిన అభ్యర్థి ఓడిపోయినట్టే. అంతటితో ఆగకుండా ఈ చట్టం ద్వారా జైలుకు వెళ్ళడం తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు తప్పదని ఆర్డినెన్స్‌లో వుంది. గరిష్టంగా మూడేళ్లు జైలు, రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. గ్రామంలో ఉండేవాళ్లే సర్పంచ్‌లుగా పోటీ చేయాలని ఆర్డినెన్స్ సూచించింది. వందశాతం గిరిజనులున్నచోట గిరిజనులకే పోటీ చేసే అవకాశాన్ని ఆర్డినెన్స్ ద్వారా కల్పించారు.
సి.ఎం. జగన్ తీసుకు వచ్చిన ఈ ఆర్డినెన్స్‌తో స్థానిక ఎన్నికల్లో నిలబడే దమ్ము ఎవరికి ఉంటుంది? అన్నీ ఏకగ్రీవంగానే అధికార పార్టీ గెల్చుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రుజువైతే అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామాభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజూ పాల్గొనాలని ఆర్డినెన్స్‌లో పేర్కొనడం వెనుక పక్కా ప్లానే వుందంటారు జేసి.
జేసీ లాంటి వాళ్ళే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేమని చేతులెత్తేస్తున్నారంటే రాష్ట్రంలో ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు ముందు వైరాగ్యం పెంచుకుంటున్నారటంటే సిఎం జగన్ సత్తా ఏమిటో ప్రతిపక్షాలకే కాదు ప్రజలకూ ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.