English | Telugu
మళ్ళీ పొంగుతున్న గోదారమ్మ... బోటు వెలికితీత పనులు నిలిపివేత
Updated : Oct 4, 2019
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన జరిగి దెగ్గర దెగ్గరగా నెల కావోస్తున్న బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోదావరి తీరం వద్ద బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కచ్చులూరు దగ్గర ఆపరేషన్ నిర్వహించేదుకు వాతావరణం అనుకూలించట్లేదు. వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుంది. దాంతో బోటు వెలికితీత పనులకు ఆటంకం వచ్చిపడింది.
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. మూడు రోజలుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం వరద ఉధృతి మరింత పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేశారు. బోటు మునిగి పోయిన చోట సుడులు తిరుగుతున్నాయి. వరద ప్రవాహం తగ్గాకే మళ్లీ ఆపరేషన్ షురూ చేసే అవకాశం కనిపిస్తోంది. బోటును వెలికితీసేందుకే ధర్మాడి సత్యం బృందం మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించింది. ఇరవై ఐదు మంది సిబ్బందితో ఒక పంటు ప్రొక్లయిన్ ఎనిమిది వందల మీటర్ల ఇనుప రోప్ తో వారు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పదిహేను మీటర్ల ఎగువున మూడు యాంకర్లు వేశారు. ఆ చివరి నుంచి ఇటు ఒడ్డుకు యాంకర్లను లాగారు. మధ్యలో యాంకర్లు కొండరాయిని పట్టుకున్నాయి. రెండవరోజు ప్రయత్నం చేయగా నీటిలో ఉన్న నాలుగు వందల మీటర్ల ఇనుప రోప్ తెగి గోదావరిలో పడిపోయింది. అలా నీటిలో పడి పోయిన రోప్ విలువ నాలుగు లక్షల వరకు ఉంటుందంటున్నారు.
గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు బరువు నలభై టన్నులు. నీటిలో నాని, బురదలో కూరుకుపోయి ఉండటం వల్ల యాభై టన్నులకు పైగా బరువు పెరిగి ఉంటదని భావిస్తున్నారు. ఒకసారి కొక్కెం తగిలితే బోటును అటూ ఇటూ కదిలిస్తే బరువు తగ్గుతుందని అంచనా. గోదావరి నదీ గర్భంలో రెండు వందల పది అడుగుల లోతులో బోటు ఉన్నట్టు సత్యం టీమ్ చెబుతోంది. కిందటి నెల పదిహేనున గోదావరిలో బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇంకా పదిహేను మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి జాడ కోసం బంధువులు కళ్లుకాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు. ఆశలు వదిలేసుకున్న కొందరు కనీసం డెత్ సర్టిఫికెట్లు అయిన జారీ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే భౌతికంగా మృతదేహం దొరకనందున ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది. గోదారమ్మ కొంచం కరునిస్తే కానీ మళ్ళీ వెలికితీత పనులు మొదలు పెట్టగలమని బృందం తెలియజేస్తున్నారు.