English | Telugu

బీజేపీ సరికొత్త వ్యూహం ఏమిటీ?

బీజేపీ మళ్ళీ కొత్త వ్యూహం అలోచించబోతోందా అనే ఆలోచనలు అందరిలో వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందే బెంగాల్ పై బిజెపి ఓ కన్నేసిందని, మమత పార్టీని మట్టికరిపించాలని నిర్ణయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నయి. అందుకు గాను యాభై శాతం విజయం కూడా సాధించింది. ఎన్నికల వేళ మోదీ పెద్ద బాంబే పేల్చారు. లోక్ సభ ఫలితాల తర్వాత తృణమూల్ ఎమ్మెల్యేలంతా తమతో కలిసిపోతారని దీదీ ఏకాకి అవుతారని ఆయన అన్నారు. సుమారు నలభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అప్పట్లో సంచలన ప్రకటనలు చేశారు. ఎన్నికల తరువాత ఆయన చెప్పింది చాలా వరకూ జరిగిందనే చెప్పాలి. పోలింగ్ కు ముందే తృణమూల్ కీలక నేత ముకుల్ రాయ్ బీజేపీలో చేరి పోయారు. ఇప్పుడు ఎన్నికల తరువాత యాభై మందికి పైగా కౌన్సిలర్లు, ఆరుగురు ఎమ్మెల్యేలు, టీఎంసీని వీడి బీజేపీ గూటికి చేరారు. తాజాగా కోల్కత్త మాజీ మేయర్ మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న శోభన్ చటర్జీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ముకుల్ రాయ్ తో పాటు ఇతర బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. శోభన్ చటర్జీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. నారద శారద స్కాంలపై దర్యాప్తు ప్రభావం తృణమూల్ నేతల పై కన్పిస్తోంది. కేసులలో ఇరుక్కున్న వారంతా ఇపుడు బీజేపీ వైపు చూస్తున్నారు. బిజెపిలో చేరిన కోల్ కత్త మాజీ మేయర్ శోభన్ చటర్జీ పై కూడా కేసులున్నాయి. కేసులున్న వారిని భయపెట్టి బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసుల విచారణకు పార్టీలో చేరికలకు సంబంధం లేదని బిజెపి వివరణ ఇస్తోంది. పార్టీ సిద్దాంతాలు నచ్చి వచ్చిన వారిని ఆహ్వానిస్తామని వారి పై కేసులు విచారణ మాత్రం కొనసాగుతోందనీ చెబుతోంది. తృణమూల్ రౌడీయిజం తోనే శరణార్ధులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు తృణమూల్ కార్యకర్తలు భారీ సంఖ్యలో శరణార్ధులపై దాడులు చేసినట్టు బిజెపి చెబుతోంది. దాడుల కారణంగా మాత్వా తెగస్థులు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. శరణార్ధులు టీఎంసీ పట్ల అనుమానంగా చూసినంతకాలం బెంగాల్లో తమ పార్టీ ఎదుగుదలకు ఢోకా లేదని బీజేపీ విశ్వసిస్తోంది. ముస్లిం శరణార్ధులను మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటోందని ఇతర మతస్థులను పట్టించుకోవడం లేదని బీజేపీ కొత్త ప్రచారం ప్రారంభించింది.

ఇప్పుడు దుర్గాపూజ సభలో అమిత్ షా స్టేట్ మెంట్ తర్వాత తృణమూల్ కూడా ఎదురు దాడి చేస్తోంది. బెంగాల్ నుంచి ముస్లిం శరణార్ధులను తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారని దీదీ అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడు రెండు పార్టీల మధ్య సంఘర్షణ ఖాయంగా కనిపిస్తోంది. పౌరసత్వ బిల్లును శక్తిమంతమైన రాజకీయ అంశంగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆర్టికల్ 370 ని ధైర్యంగా రద్దు చేసినట్టుగానే పౌరసత్వ సవరణ బిల్లును కూడా ఆమోదిస్తామని దసరా నవరాత్రుల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చింది. శరణార్ధులకు న్యాయం చేయడం వారికి పౌరసత్వం కల్పించటం ఒక వంతైతే, అక్రమ వలసలను అడ్డుకోవడం రెండో వంతు. ఇప్పుడు రెండో సమస్యపై బీజేపీ దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే రెండో అంశానికీ మొదటి అంశానికీ విడదీయరాని సంబంధం ఉందని బీజేపీ భావిస్తోంది. అస్సాం తరహా సమస్యలు బెంగాల్లో తలెత్తకుండా చూడాలంటే అక్కడ ఎన్ఆర్సి అమలుకు ముందే పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించాలని బిజెపి గుర్తించింది. అప్పుడు భారత పౌరుల జాబితాలో లేని వ్యక్తులు ఫారినర్స్ ట్రిబ్యునల్ ముందు హాజరై తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది మాత్రం అలాంటి తెగలకు ప్రయోజనకరం, అందుకే పౌరసత్వ బిల్లు ఇపుడు బిజెపికి పెద్ద ట్రంప్ కార్డ్, తృణమూల్ దెబ్బకొట్టే పెద్ద అంశం కూడా అదే. బీజేపీ వ్యూహం కొల్కత్తలో నెగ్గనుందోలేదో వేచి చూడాలి.