English | Telugu
నూర్జహాన్ కళ్యాణ మండపంలో రహస్యంగా మకాం వేసిన వారెవరు?
Updated : Apr 2, 2020
* కరోనా తీవ్రత కన్నా, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?
ఇప్పుడు కడప లో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. కానీ, దీనికి డెప్యూటీ సిఎం అంజాద్ బాషా కానీ, పోలీసు యంత్రాంగం కానీ సమాధానం ఇవ్వటం లేదు. వారి మౌనం, లేదా నీళ్లు నమలడం చూస్తుంటే, అంజాద్ బాషా సన్నిహితుల వివరాలేవీ బయటకు పొక్కే అవకాశం లేకుండా పోయింది. ఇదే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ మీడియా తో మాట్లాడుతూ, కడప జిల్లా లో దారుణమైన పరిస్థితి కి అధికారుల వైఫల్యమే కారణమని, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటన వెనుక ఉన్న చిదంబర రహస్యమేమిటో బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. నూర్జాహాన్ కళ్యాణ మండపంలో రహస్యంగా మకాం వేసిన వారెవరని ప్రశ్నించిన ఆయన, పోలీసులు ఇందులో నిజాలను నిగ్గు తేల్చకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. 30మంది మత ప్రచారకులకు ఆశ్రయం కల్పించిందెవరో స్పష్ట చేయాలనీ, ఆశ్రయం కల్పించిన పెద్ద నేత ఎవరో బహిర్గత పరచాలని కూడా డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులను కాపాడుకోలేని డిప్యూటీ సీఎం ప్రజలకేమి చేస్తారని కూడా బండి ప్రభాకర్ ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని, లాక్ డౌన్ అంటే లాఠీ చార్జీలు కాదని, ప్రపంచ దేశాలే వణికిపోతుంటే దాన్ని సీఎం జగన్ తేలికగా తీసుకోవడం తగదని, కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడైనా క్లోరినేషన్ చేశారా అనీ ఆయన ప్రశ్నించారు. భాద్యత కలిగిన హాదాలో ఉన్న కమీషనర్ 30మంది మత ప్రచారకులను ఎక్కడికి తరలించారంటే సమాధానం లేదు.బంధువు డిల్లీకి వెళ్ళినా ఎందుకు డిప్యూటీ సీఎం బయట పెట్టలేదని ఆయన నిలదీశారు. " ప్రాణాలు గుప్పెట్లో బ్రతుకుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని డిల్లీకి వెళ్లిన వారి పేర్లు డిప్యూటీ సీఎం బయట పెట్టాలి.డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనుక తిరిగిన అధికారుల పరిస్థితి ఏమిటని ప్రభాకర్ ప్రశ్నించారు. ద్రోహులు గా మారవద్దని అధికారులను బీ జె పీ నేత హెచ్చరించారు.