English | Telugu
నిజాముద్దీన్ మర్కజ్ లో కరోనా తిష్ట ఎలా వేసింది?
Updated : Apr 1, 2020
మలేసియాలో బయటపడిన కరోనా పాజిటివ్ కేసుల్లో మూడో వంతు కేసులు తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారివే. బ్రూనైలో బయటపడ్డ మొత్తం 40 కరోనా కేసుల్లో 38 మంది ఇదే మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని అల్ జజీరా రిపోర్ట్ చెప్పింది. ఈ మసీదులో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సింగపూర్, మలేసియా సహా భారత్‌లో వైరస్ వ్యాపించింది.
తెలంగాణలో కరోనాతో చనిపోయిన ఆరుగురు ఢిల్లీ జమాత్ కార్యాలయం నుంచి రావడంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ పతాకశీర్షికల్లో నిలిచింది. అసలు ఈ డెడ్లీ వైరస్ కరోనా ఢిల్లీ మర్కజ్‌లో ఎలా తిష్ట వేసింది. అసలు ఇంత మంది ముస్లింలు ఎందుకు ఇక్కడ సమావేశం అయ్యారు?
తబ్లీక్ జమాత్ మర్కజ్ 1920 నుంచీ నడుస్తున్న ఒక మత సంస్థ. దిల్లీలోని నిజాముద్దీన్ దీని హెడ్ క్వార్టర్ ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ముస్లిం సంస్థ. దీని సెంటర్లు 140 దేశాల్లో ఉన్నాయి.
ఇండియాలో జమాత్ హెడ్‌క్వార్టర్ కార్యాలయం ఇది. ఏడాది పొడుగునా ఇక్కడ జమాత్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మార్చి నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల అంతర్జాతీయ ఇస్తమా ఇక్కడ జరిగింది. విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. జమాత్ మర్కజ్ సమీపంలో నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్, ఆ పక్కనే ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా దర్గా కూడా ఉన్నాయి.
ఢిల్లీ మర్కజ్‌లో మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన మూడు రోజుల సమావేశాల్లో దాదాపు 2 వేల 500 మంది పాల్గొన్నారు.
వెయ్యి మంది వెళ్లి పోయారు. 1500 మంది అక్కడే వున్నారు. ఆ తరువాత జరిగిన లాక్‌డౌన్ నేపథ్యంలో బయటికి వెళ్లలేక వీరంతా అక్కడే వుండిపోయారు. ప్రస్తుతం ఈ 1500 మందిని మర్కజ్ భవన్ లో క్వారంటైన్ లో ఉంచినట్లు సి.ఎం. కేజ్రీవాల్ తెలిపారు.
దిల్లీ పోలీసులు నిజాముద్దీన్ మొత్తం ప్రాంతాన్ని సీజ్ చేశారు.
నిజాముద్దీన్ మర్కజ్ నుంచి వెళ్లి పోయిన వెయ్యి మందిలో విదేశీయులు ఎంత మంది? భారతీయులు ఎంత మంది? ఏ రాష్ట్రాల వారు వున్నారు? అందులో తెలుగువారంత మంది? ఎంత మందికి పాజిటివ్ వచ్చి వుంటుంది. వారెంత మందికి అంటించి వుంటారు? ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్ళి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే వీరు ఎంత మందికి ఈ వైరస్ అంటించి వుంటారనేది ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారిని కలిసిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్య సలహా తీసుకుంటే మరణాల్ని కొంత వరకు తగ్గించవచ్చు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు భయపడి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇది అందరికీ చుట్టుకుంది.
భారత్‌లోని అన్నిజిల్లా కేంద్రాల్లో జమాత్ 'మర్కజ్'లు ఉన్నాయి. వీటిలో ఏడాది అంతా ఇజ్తెమా జరుగుతూనే వుంటుంది. అంటే జమాత్‌ను అనుసరించే ముస్లింలు వస్తూపోతూ ఉంటారు. ప్రతి ఇజ్తెమా 3 నుంచి 5 రోజులు నడుస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చిన వారు జిల్లా కేంద్రంల్లో వున్న మర్కజ్ మసీదుల్లో జరిగే ఇస్తమాలో పాల్గొని వుంటే పరిస్థితి దారుణంగా వుంటుంది.
ఆసక్తి కరమైన విషయం ఏమంటే మార్చి 13వ తేదీ జమాత్ సమావేశాలు ప్రారంభం అయిన రోజున కేంద్ర ఆరోగ్యశాఖ "కరోనా హెల్త్ ఎమర్జెన్సీ కాద"ని ప్రకటించింది. 15వ తేదీ సమావేశాలు ముగిశాయి.
అయితే 16వతేదీ అన్ని మతసంస్థల్ని మూసివేస్తూ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో 1500 మంది వరకు ఇక్కడే వుండిపోయారని జమాత్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
వైరస్ వార్తలు వెల్లడైన తర్వాత కూడా 70,000పైగా విదేశాలనుండి తరలి వచ్చిన వారిని దేశమ్మీదకు వదిలేసిన ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిక్ మర్కజ్ అద్దం పడుతోంది. కౌలాలంపూర్‌లోని ఒక మసీదులో అంటుకున్న ఈ వైరస్ తబ్లీక్ జమాత్‌కు చెందిన వ్యక్తి ద్వారా ఢిల్లీ మర్కజ్‌కు చేరుకుంది. కేంద్రప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేసినట్లైతే మనకు ఈ దుర్గతి పట్టేది కాదు.