English | Telugu

గవర్నర్‌ తో నిమ్మగడ్డ భేటీ.. ఇంతలోనే మరో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ తో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతిపత్రం అందజేశారు.

తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై, ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించింది.

దీంతో ఈ రోజు ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా మళ్లీ నియమించాలని వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు, తదితర అంశాలపై గవర్నర్‌ తో ఆయన దాదాపు గంట సేపు మాట్లాడారు. మరి నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమించడంపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటే నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‍లో పేర్కొంది. మొత్తానికి ప్రభుత్వ తీరు చూస్తుంటే నిమ్మగడ్డ వ్యవహారానికి ఇప్పట్లో శుభం కార్డ్ వేసేలా లేదు.