English | Telugu

అమ్మాయిల పిచ్చే అతని ప్రాణం తీసింది... జూబ్లీహిల్స్ మర్డర్ కేసులో కొత్త కోణం

హైదరాబాద్ బోరబండ చేపల వ్యాపారి రమేష్ హత్య పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. అయితే, రమేష్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలపై అతనికున్న పిచ్చే రమేష్ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని పోలీసులు గుర్తించారు. చేపల వ్యాపారి రమేష్ కు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకునే నిందితుడు హత్యకు ప్లాన్ చేశాడని తెలిపారు. రమేష్ ఇంట్లో అద్దెకుండి ఖాళీ చేసిన రాజు నాయకే ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీకి అలవాటుపడ్డ నిందితుడు రాజు నాయక్.... రమేష్ ను హానీ ట్రాప్ చేశాడు. తన దగ్గర అమ్మాయి రెడీగా ఉందని... రూముకు రావాలని ఫోన్ చేశాడు. రాజు నాయక్ మాటల నమ్మిన రమేష్... అతని రూముకు వెళ్లాడు. ఆ తర్వాత మద్యంలో మత్తు మందు కలిపి చంపేశాడు. అనంతరం రమేష్ ఒంటిపైనున్న బంగారాన్ని తీసుకుని తాకట్టు పెట్టాడు.

అయితే, మళ్లీ రూముకి వచ్చిన నిందితుడు రాజునాయక్.... రమేష్ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి 90లక్షలు ఇస్తే విడిచిపెడతానని, లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. మరోవైపు, డెడ్ బాడీ డీకంపోజ్ అవుతుండటంతో ఎలాగైనాసరే బయటికి తరలించాలనుకున్నాడు. మృతదేహంలో కొన్ని భాగాలు నరికి ప్లాస్టింగ్ కవర్లో ప్యాక్ చేశాడు. అయితే, భారీ కాయం కావడంతో డెడ్ బాడీని బయటికి తరలించలేక రూమ్ లోనే వదిలేసి పరారయ్యాడు. చివరికి రూము నుంచి దుర్వాసన రావడంతో రమేష్ హత్య బయటపడింది. అయితే, సీసీటీవీ ఫుటేజ్, రూములో దొరికిన క్లూస్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు రాజు నాయక్ ను అతనికి సహకరించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

అయితే, సమాజంలోనే ప్రతి సంఘటన నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకుని అప్రమత్తం కావాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తుంది. ఇలా, అమ్మాయిలపై పిచ్చితో హానీ ట్రాప్ లో చిక్కుకుని ప్రముఖ వ్యాపారవేత్త జయరాం అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. మీడియాలో జయరాం హత్య పెద్దసంచలనమైంది. అమ్మాయిలపై పిచ్చే అతని ప్రాణాలు తీసిందని తెలిసింది. తెలిసినే వ్యక్తే హానీ ట్రాప్ తో ఇంటికి రప్పించుకుని కొట్టిచంపేశాడు. ఇలాంటి ఘటనలు రోజూ మన కళ్లే ముందే కనిపిస్తున్నా జాగ్రత్తపడకుండా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం శోచనీయమే.